!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 247-248
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 247-248
మహావాక్య విచారము: 243 నుంచి 251 వరకు ఎనిమిది
శ్లోకాలలో గురువు తత్వమసి అన్న మహావాక్యము
విశదీకరిస్తాడు.
ముందు నాలుగు శ్లోకాలలో విన్నది:
తత్వమసి అన్న మహావాక్యములో జీవ బ్రహ్మముల ఏకత్వము
ప్రతిపాదించబడినది. ఆ ఏకత్వము వాటి అంతరార్థము ద్వారా
వస్తుంది కాని, పరస్పర విరుద్ధమైన , మెరుగుపురుగు -
సూర్యుడు ; రాజు -రాజభటులు ; పరమాణువు-మందరపర్వతము;
కూపము-మహాసముద్రము లాంటి మాటల
అర్థము ద్వారా కాదు అని:
ఆ రెండిటి విరోధము వాటి ఉపాధి వలననే; యదార్థమైన
విరోధము లేదు; మహాతత్త్వము అహంకారము మొదలగు వాటితో
కూడిన జగత్తుకి కారణ మైన మాయ, ఈశ్వరుని ఉపాధి; జీవుడి
ఉపాధి కార్యరూపమైన పంచకోశములు.
పరమాత్మ జీవుల వారి ఈ ఉపాధిని - పూర్తిగా తీసేస్తే
పరమాత్మాలేడు జీవుడు లేడు. రాజు యొక్క రాజ్యము, భటుడి
ఆయుధము వాటిని తొలగిస్తే భటుడు లేడు రాజు లేడు.
ఇక 247, 248 శ్లోకాలు.
శ్లోకము 247
అథాత ఆదేశ ఇతి శృతిః స్వయం
నిషేధతి బ్రహ్మణి కల్పిత స్వయం|
శృతిప్రమాణానుగృహీత బోధాత్
తయోః నిరాసః కరణీయ ఏవ ||247||
మొదటి పాదము:
అథాత ఆదేశ ఇతి శృతిః స్వయం
’అథాత ఆదేశో నేతి నేతి’ అనబడే శ్రుతి వాక్యము
స్వయముగా...’
ఇక్కడ గురువు బృహదారణ్య ఉపనైషత్తులో వాక్యము గుర్తు
చేస్తున్నాడు: ఆవాక్యము స్వయముగా ఏదో చెప్పినదన్నమాట.
అదే ఇప్పుడు ప్రస్తావనలోకి తీసుకువస్తున్నాడు గురువు.
రెండవ పాదము:
నిషేధతి బ్రహ్మణి కల్పిత స్వయం|
బ్రహ్మము యందు కల్పింపబడిన ద్వైతమును
నిషేధించుచున్నది.
అంటే బృహదారణ్యకోపనిషత్తులే చెప్పబడిన ’ అథాత ఆదేశో
నేతి నేతి.." అనే వాక్యము ద్వారా బ్రహ్మము యందు
కల్పింపబడిన ద్వైతము నిషేధింపబడినది.
మనకు కనపడే ప్రతి వస్తువు , అది అది కాదు , అది దాని
వెనకాతల వున్నబ్రహ్మమే అని; బ్రహ్మమే మసి పూసి
మారేడికాయ చేయబడినది అన్నట్లు, సృష్టిలో సమస్తము
బ్రహ్మస్వరూపమే కాని మనము దానిని వివిధ రూపాలతో చూచి
వివిధ నామాలతో పిలుస్తున్నాము అంతే కథ. బ్రహ్మము వేరే
ప్రపంచము వేరే అనడానికి వీలు లేదు అని, బ్రహ్మ సత్యము
జగత్తు మిథ్య అని, అవి రెండు వేరే ( ద్వైతము) అనుకుంటే
వచ్చే నష్టాలు కష్టాలు ముందు శ్లోకాలలో తెలుసు
కున్నాము. ఇక్కడ గురువు అదే మాట శ్రుతులలో చెప్పబడిన
ఆదేశము ద్వారా - బ్రహ్మము లో ద్వైతము లేదు (
నిషేధింపబడినది) అని గురువు చెప్పాడు.
మూడవపాదము
శృతిప్రమాణానుగృహీత బోధాత్
శృతి యొక్క ప్రమాణము చే అనుగ్రహింపబడిన బోధనతో,
అంటే , బ్రహ్మము తప్ప ఇంకఏమీ లేదు అనే జ్ఞానముతో ( అది
శృతులు చెప్పినమాట), ప్రతి వస్తువు అది దాని అధిష్టాన
స్వరూపమే, అంటే బ్రహ్మమే అని గ్రహించి -
ఇప్పుడు ముఖ్యమైన మాట :
ఈశ్వరుడి ఉపాధి మాయ
జీవుడి ఉపాధి పంచకోశములు
తొలగించవచ్చు. అది నాల్గొవ పాదములో వింటాము.
నాల్గొవ పాదము
తయోః నిరాసః కరణీయ ఏవ
ఆ రెండిటి ( ఈశ్వరుడు జీవుడు ఉపాధులయొక్క
నిరాకరణము చేయతగినదే.
అంటే ||247|| శ్లోక తాత్పర్యము:
’అథాత ఆదేశో నేతి నేతి’ అనబడే శ్రుతి వాక్యము
స్వయముగా...’ బ్రహ్మము యందు కల్పింపబడిన ద్వైతమును
నిషేధించుచున్నది. శృతి యొక్క ప్రమాణము చే
అనుగ్రహింపబడిన బోధనతో, ఆ రెండిటి ( ఈశ్వరుడు జీవుడు
ఉపాధులయొక్క నిరాకరణము చేయతగినదే. ||247||
ముందు శ్లోకములో ఆ రెండిటి ఉపాధులూ తొలగిస్తే -
"సమ్యక్ నిరాస్తే న పరో న జీవః " ఈశ్వరుడూ లేడు
జీవుడూ లేడు అని అన్నాడు. ఇక్కడి శ్లోకములో అలా
ఉపాధులు తొలగింవవచ్చు నిస్సందేహముగా.. అని
బ్రహదారణ్యక ఉపనిషత్తు వాక్యము తీసుకొని మనకి చెప్పాడు
గురువు.
ఉపాధులు తొలగిస్తే మిగిలేది బ్రహ్మమే అని మనకి
అనిపించినా , గురువు తన పద్ధతి లో ముందు శ్లోకములో
మనలని , శిష్యుడిని ముందుకు తీసుకు వెడతాడు
శ్లోకము - 248:
నేదం నేదం కల్పితత్వాత్ న సత్యం
రజ్జో ద్రష్టవ్యాలవత్స్వప్నవత్ చ|
ఇత్థమ్ దృశ్యం సాధు యుక్తా వ్యపోహ్య
జ్ఞేయః పశ్చాత్ ఏకభావస్తయోర్యః||248||
మొదటి పాదము:
నేదం నేదం కల్పితత్వాత్ న సత్యం
ఇదికాదు ఇదికాదు అన్నది కల్పించబడడమువలన సత్యము
కాదు అని
ఇది కాదు ఇది కాదు అన్నమాట ఎలావచ్చింది? అది కల్పపితము
కాబట్టి , కల్పితము అసత్యము కాబట్టి , మనము ఇది కాదు
ఇది కాదు అని ముందుకు పోగలిగాము. గురువు అలా
కల్పించబడినవాటి ఉదాహరణ రెండవపాదములో చెపుతాడు.
మనకి గుర్తుకు వచ్చే ఉదాహరణ: మనము పంచకోశములలో ఆత్మ
ఎక్కడ వున్నది అని చూస్తున్నప్పుడు, అన్నమయకోశము ఇది
ఆత్మ కాదు , మనోమయ కోశము ఇది ఆత్మకాదు అని ఎలా
అన్నాము. దేహమే ఆత్మ అన్నది కల్పితమైన మాట. మనస్సే
ఆత్మ అన్నది మనమే భ్రాంతిలో కల్పించుకున్నమాట. అలా
కల్పించుకున్న మాటలు అసత్యము.
రెండవ పాదము
రజ్జో ద్రష్టవ్యాలవత్ స్వప్నవత్ చ|
తాడుపై చూడబడిన పాము వలె, (నిద్రలో వచ్చిన)
స్వప్నమువలె
తాడుపై చూడబడిన పాము వలె, (నిద్రలో వచ్చిన)
స్వప్నమువలె. పాము కల్పితము కనుక అది అసత్యము. తాడు
మాత్రమే నిజము.
మూడవ పాదము:
ఇత్థమ్ దృశ్యం సాధు యుక్తా వ్యపోహ్య
ఈ విధముగా కనపడు వాటిని యుక్తితో తొలగించి
నాల్గొవ పాదము
జ్ఞేయః పశ్చాత్ ఏకభావస్తయోర్యః|
జ్ఞేయః పశ్చాత్ ఏకభావః తయోః యః
పశ్చాత్ తయో యః ఏకభావః జ్ఞేయః |
తరువాత వాటిలో ఏ ఏకభావము కలదో అది తెలిసికొన తగినది.
అంటే పైకి కనపడే నామ రూపాలని తొలగించి మిగిలినదానిలో
ఏకత్వము గ్రహించాలి అన్నమాట.
అదే ఈ శ్లోక తాత్పర్యము.
శ్లోకము 248 - తాత్పర్యము:
ఇదికాదు ఇదికాదు అన్నది కల్పించబడడమువలన
తాడుపై చూడబడిన పాము వలె, (నిద్రలో వచ్చిన)
స్వప్నమువలె సత్యము కాదు. ఈ విధముగా కనపడు వాటిని
యుక్తితో తొలగించి, తరువాత వాటిలో ఏ ఏకభావము కలదో అది
తెలిసికొన తగినది.
||ఓమ్ తత్ సత్||
_________________________________________________________________