Sankshipta Sundarakanda - A Telugu Poem

By Padmashri Elchuri Vijayraghavrao


పునరాగమనము

Select Transliterated Telugu text in Devanagari or English

నభోవీధి నలుగడలను
నాట్యమాడు మేఘము వలె
పర్వతాగ్రమును బోలిన
పవన సుతుడు గర్జించుచు
సీతల దృమమయ
“మహేంద్ర శిఖరము” పై
దిగివచ్చెను!

వానరులందరూ అపుడు
వాయు సుతునిగని, భక్తిగ
చేతుల జోడించి నిలిచి
చేమోడ్పుల నర్పించిరి.....


జరిగిన వృత్తాంత మంత
ఎఱుగ దలచి సంతసముగ
జాంబవంతుడు హనుమను
జానకిని గురించి ప్రశ్నించె

“సీత నెట్లు కనుగొంటివి?
స్తిమితముగా నుండె గదా...
క్రూరుడు రావణుడామెను
కుత్సితముగ బాధించెనా?”

పుణ్య జానకిని గురించి
పులకితమనుడైన మారుతి,
బయలుదేరినది మొదలుగ,
భద్రముగా సముద్రమును
లంఘించిన ఘడియ నుండి
లంకా దహనము వరకూ
సువృత్తాంత సర్వస్వము
సవిస్తృతముగ వర్ణించి
జాంబవంతునితో నిట్లనె

“శ్రీరాముడు, సుగ్రీవుడు
సీతా విముక్తికి చేసెడు
జతనములిక సఫలమగును......

రతనము వలె శీలముగల
సతీ సాధ్వి జానకిపై
భగవత్కృప వలన నాకు
భక్తి సమన్విత మైనది....


స్వత: తాను బహు కృశాంగి.....
పతి వియోగ దుఃఖముతో
పటుతరముగ కృశించినది!
ప్రాప్తించిన దుఃఖమునకు
ప్రతీకార విధి గనవలె....”

వాలి పుత్రుడు అంగదుడప్పుడు
వాయుసుతునికి వాక్రుచ్చె నిటుల

“రాక్షస సహితముగా లంకాపురి
రంపియతో ఖండించి వేతును...
రాక్షస రాజగు రావణాసురుని
రయముగ వధింతు నేనొక్కడనే...

మిగతా వీరులూ, మీరూ తలపడి
మిన్ను మన్ను నేకము జేయవలయు...
సీతాదేవిని గొనిపోకుండా
శ్రీరాముని కడకేగుటనుచితము;
యోధులైన వానర వీరుల కది
యోగ్యము గాదని నాకు తోచినది”

ఈ మాటలు విని సంతోషముగా
నిట్లనె జాంబవంతు డాతనితో

“అంగదా!
నీ ఆలోచనలత్యుత్తమమైనవని
గ్రహించితి!
రణవీరుల గల వానర సైన్యము
రాక్షసులను జయించి తీరగలదు
కానీ!

రాముని ఆజ్ఞా పాలన
గావించుటయే మనకర్తవ్యము....
కావున రాముని యానతి గైకొని
కార్య సిద్ధి ఎట్లగునో చూతము...”

జాంబవంతుని పలుకులు
జాగ్రముగా విని యోధులు
హితముగ అట్లే చేయుట
కిచ్చగించి సంతుష్టులై
మహేంద్ర పర్వతమును విడిచి
మరలి పోవ సమకట్టిరి....

ఆకస మార్గమునందు బోవుతరి
అతి సుందర లత, సుమ, దృమములు గల
ఇంద్రుని నందన వనమును బోలిన
ఇంపైన 'మధువనము' ను
గాంచిరట!

ఏ ప్రాణికినీ తేఱి చూచుటకు
ఎన్నడునూ సాధ్యముగా దక్కడ!
వాసిగ మనోజ్ఞమైన ఆ వనము
వానరేంద్రుడగు సుగ్రీవునిది....

అంగదాజ్ఞగొని అందరు వనమున
ఆనందముతో నోలలాడుచూ
కోరిన రీతిని ప్రేరణను బొంది
కొందరు నృత్యము చేయ దొడంగిరి!
కొందరు ఫలమూలాదులను తెంచి
కొంటెగ వనమును ధ్వంసము జేసిరి!

మధువన రక్షకుడైన 'దధిముఖుడు'
మదటగ చెలరేగిన వానరులను
వారించిననూ ధిక్కరించుచూ
వానిని హింసించి వనము దోచిరి!

మధుపాన భ్రష్టుడైన అంగదుడు
మైకముతో తన పితా మహుడైన
దధిముఖుని గుర్తించనే లేక
పృధివిపై నెట్టి బాధించ దొడగె!

దైవమనస్కుడూ వయోవృద్ధుడగు
దధిముఖుడట నుండి తప్పించుకుని
ఏకాంత ప్రవేశమునకు జేర్మొని
ఎదుటి సేవకులతో తానిట్లనె

“అంగదాదులను అట్లుండ నిండు;
వంద్యుడు, మన ప్రభువు, ఘనుడైన
వానరేంద్రుడగు సుగ్రీవు డిపుడు
వాసు దేవుడైన రామునికడ గలడు;
పోయి సుగ్రీవునికి దెలుపుదుము;
పొలువను తగిన రీతి శిక్షించును”

దధిముఖుడపుడు వన పాలకులతో
దారున ఆకసమున నెగురుచూ
క్షణ కాలములో రాఘవుడు, మరియు
సుగ్రీవుడున్న స్థలమునకు జేరెను...

మధువన రక్షకుల నాయకుడైన
దధిముఖుడందరు భృత్యుల నడుమన
సుడిబడు ఎదతో శిరము నొగ్గుచూ
సుగ్రీవుని పాదములపై వాలెను!

సాష్టాంగ నమస్కారము జేసిన
సాధువానరుని జూచి కలతతో
“దధిముఖుడా! నా పాదముపైబడి
దండములుడిగితి వెందులకు?
లెమ్ము....
అభయము నిచ్చితి....
నీమనసు నొచ్చు అహితమేమి జరిగెను?
వినగోరెద....”

అట్లు మహాత్ముడు సుగ్రీవుడు తన
కభయము నొసగగ, దధిముఖుడిట్లనె
“రాజా! మీ తండ్రి గారు 
ఋక్షరజుని కాలముననో,
వంద్యుడు, రాజేంద్రుడైన
వాలి కాలముననో, లేక
ఇపుడో, అపుడో, ఎపుడూ
చొర శక్యముగాని
దివ్య తరమగు మధు వనము నిపుడు
అంగదాది కపి మూకలు
అతి ధ్వంసము జేసి తుదకు
మద్యము సేవించి, మమ్ము
మైకముతో పీడించిరి!”

అదివిని సుగ్రీవుడనెను
“కార్య విజయ ఫల ప్రాప్తిని
గనిన హర్షపాతమందు
ఫలములు తిని
తేనె తాగి
బలముగ క్రీడారతులై
వాంఛ దీర వర్తించి రేమో!

క్రియావంతులై నందున
ప్రియముగ
నే క్షమించితిని....
మరల నీవు మునుపటి వలె
మధు వనమును కాపాడుము...
వాయు సుతుని సహితముగ
వానర ఘనులను
పంపు మిటకు....”

సంతుష్టుడైన దధిముఖుడు
సంతసించి వినయముతో
రామ లక్ష్మణ సుగ్రీవుల
నామ మెంచి నమస్కరించె....

ఆ తదుపరి తిరిగి వచ్చి రయముగ
అంగదాదులను, గలిసి దధిముఖుడు
అందఱి క్షేమమెఱింగి, సౌమ్యముగ
“వంద్యుడు మీ పినతండ్రి మహిమగల
వానరేంద్రుడగు సుగ్రీవుడు, మిము
శీఘ్రముగా నచ్చటికి పంపమని
చెప్పెను నాతో
వెళ్ళ గోరెద” ననె....

అంత, వానరుల 'కిల కిల' శబ్ధము
లాకాశములో ప్రతి ధ్వనించెను!
రాముని దర్శనకుతూహలముతో
వానరు లొచ్చిన హర్షధ్వని, అది!
అంగదుడిని, హనుమను ముందిడుకొని
ఎందరెందరో విచ్చేసిరటకు!

రణవీరుడు, కపివర్యుడు హనుమడు
రాముని కడ శిరసొగ్గి ప్రణమిల్లి
పాతివ్రత్య నిర్ణయముతో నున్న
పావని జానకి క్షేమము దెలిపెను...

సీతా దేవిని దర్శించిన విధి
శ్రీరాముని కడ వర్ణన జేయుచు
“ఆమెను రావణ అంత: పురమున
అతిక్రూరముగా నిర్భంధించిరి;
ఒంటి జడ ధరించి దీనురాలై
ఒంటమిగా అసురలు చుట్టు ముట్టి
అనవరతము మీ ధ్యాన మగ్నయై
అతి వియోగ దుఃఖమును జెందినది”

అట్లు చెప్పి రామునికి పవనసుతు
డందజేసె అనుపమ చూడామణి!
దైతునకై పంపిన చూడామణి
దశరధ రాజ సుపుత్రుడు గైకొని
తలమునకలుగా తన ఎద చలించి
తనువు కన్నీటి సాగర మాయెను!

సిక్తనయనములతో ముద్రిక గని
సీతా దేవిని జూచినట్లాయె!!

“అంజన సుతుడా! మఱి మఱి దెలుపుము
అమె వాక్కు నాకమృతవర్నిణి...
దాహార్తునికై జల తృప్తి బోలె
తనివి తీర విని
శమనమగును ఎద....”

మహాత్ముడగు రామచంద్రునికి మారుతి
సీతా వాక్కులను ప్రీతిగ జెప్పెను
“కోమల హృదయుడు రామునికి నాపై
కొంచెమైన అభిమానమున్నచో
ధనుర్ధారియై శీఘ్రమేతెంచి
దశాననుని దండించి, ఖండించి
రణమున ఘనవిజయమొందవలెనని
రామా! జానకి నిన్ను కోరినది...

కన్నుల నీరు నింపుకొని నాతో
కరుణ వాక్యములు పరిపరి బలుకగ
వైదేహిని గని
నేనిట్లంటిని

'పరమ పావనీ! సీతా దేవీ!
పరమాత్ముడు రాముడు యుద్ధములో
దుష్ట రావణుని బంధు సహితముగ
తుత్తునియలు జేసి అయోధ్యకు
తురితము నినుగొనిపోవుట
తథ్యము..

శతృ మర్దనము గావించిగనే
శౌర్యపరాక్రముడైన రాఘవుడు
వన వాసము నుండి తరలి
నీతో వైభవముగ పట్టాభిషిక్తుడగును!'

అది విని వియోగ సంతప్తయైన
ఆమె కనులు అశృభరిత మాయెను!
మరల ప్రీతిగల మాటలు జెప్పితి;
మాత సీత కుపశమనము గల్గెను..."

***
సుందరకాండ సమాప్తము

***
శ్రీరామా! జయము! జయము!
సీతారామా జై! జై!

***

“పవన తనయ సంకటహరణ
మంగళ మూరతి రూప!
రామ లక్ష్మణ సీతా సహిత
హృదయ బసహు
సురభూపా!”
శుభమస్తు!

***
***

||om tat sat||

___________________________________________________________________________