!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 262-263
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి 262-263 శ్లోకములు
శ్లోకము 262:
నిర్వికల్పకమ్ అనల్పమక్షరమ్
యత్ క్షరాక్షర విలక్షణం పరమ్।
నిత్యమవ్యయసుఖం నిరంజనమ్
బ్రహ్మ తత్త్వమ్ అసి భావయాత్మని॥
1 నిర్వికల్పకమ్ అనల్పం అక్షరమ్:
వికల్పశూన్యమైనది , అల్పము కానిది, నాశరహితమైనది;
సమస్త చరాచరములన్నియూ బ్రహ్మమే అయినప్పుడు, బ్రహ్మము వికల్పశూన్యము అని ఏలాగ అంటున్నాడు గురువు అనే అనుమానం వస్తే చరచరములన్నీ వేరు వేరుగా నామధేయాలతో కనపదేది మాయవలననే , ఆమాయ తొలగి పోగానే మనకి అది అంతా బ్రహ్మమే అని తెలుస్తుంది. ఇక్కడ బ్రహ్మము మారలేదు. మన అజ్ఞానము పోయి అంతా బ్రహ్మమే అని మనము తెలుసుకుంటున్నాము. అందుకని బ్రహ్మము వికల్ప శూన్యమైనది అన్నమాట సత్యము. అల్పముకానిది కూడా మనము విన్నమాటే. భూమి ఆకాశాలతో కూడిన బ్రహ్మము అల్పము కానిది. అది వేదాలలో కూడా వచ్చిన మాటే. బ్రహ్మము ఆది అంతములు లేనిది అంటే అది అనంతము. అనంతము అయినది అల్పముకాదు. అదే ఇక్కడ చెప్పబడిన మాట.
2 యత్ క్షరాక్షర విలక్షణం పరమ్।
ఎదైతే క్షరము అక్షరము కన్నా భిన్నమైనది సర్వోత్కృష్టమైనది;
క్షరము అక్షరము అన్న మాటలు మనకి భగవద్గీతలో (15 వ అధ్యాయములో) వినిపిస్తాయి. " ద్వావిమౌ పురుషో లోకే క్షరాక్షరఏవచ। క్షరస్సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే"; సమస్తభూతములు క్షరుడు అని- అంటే నశించి పోయేవి అని; కూటస్థుడు అక్షరుడు అని, ఈ రెండూ కాకుండా -"ఉత్తమపురుషః అన్యః" ఉత్తమపురుషుడు ఇంకోడు - వాడే పరమాత్మ అని చెప్పబడతాడు అని కృష్ణుడు అన్నమాట. అదే మాట ఇక్కడ గురువు బ్రహ్మము క్షరము అక్షరము కన్నా భిన్నమైనది అని అన్నాడు.
3 నిత్యం అవ్యయసుఖం నిరంజనమ్:
నిత్యమైనదియూ, అనంత సుఖరూపమైనదియూ, తమో రహితమైనదియూ అగు
4 బ్రహ్మ తత్త్వమ్ అసి భావయాత్మని
ఆ బ్రహ్మమే నీవు అని గ్రహించి మనస్సులో ధ్యానింపుము.
శ్లోకతాత్పర్యము 262:
ఏదైతే వికల్పశూన్యమైనది , అల్పము కానిది, నాశరహితమైనదియో
; ఎదైతే క్షరము అక్షరము కన్నా భిన్నమైనది సర్వోత్కృష్టమైనది ; నిత్యమైనదియూ, అనంత సుఖరూపమైనదియూ, తమో రహితమైనదియూ అగు ఆ బ్రహ్మమే నీవు అని గ్రహించి మనస్సులో ధ్యానింపుము.
శ్లోకము 263
యద్విభాతిసత్ అనేకథా భ్రమాత్
నామ రూప గుణ విక్రియాత్మనా ।
హేమవత్ స్వయమ్ అవిక్రయం తథా
బ్రహ్మ తత్త్వమ్ అసి భావయాత్మని॥
యద్విభాతిసత్ అనేకథా భ్రమాత్ -
ఏదైతే ఒకటే అయినా భ్రాన్తిలో అనేకవిధములుగా కనపడునో
నామ రూప గుణ విక్రియాత్మనా -
నామ రూప గుణ మార్పులతో
హేమవత్ స్వయమ్ అవిక్రయం తథా-
బంగారమువలే స్వయముగా మార్పుచెందనిదో
ఒకే బంగారము, కంసాలి చేతుల్లో అనేక రకములైన ఆభరణాల రూపములలో ప్రకాశించినా అది అంతా మార్పు లేని బంగారమే - అలాగే మార్పు చెందనిది బ్రహ్మము.
బ్రహ్మ తత్త్వమ్ అసి భావయాత్మని-
ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము
263 వ శ్లోకతాత్పర్యము:
ఏదైతే ఒకటే అయినా భ్రాన్తిలో అనేకవిధములుగా నామ రూప గుణ మార్పులతో కనపడునో; ఏది బంగారమువలే స్వయముగా మార్పుచెందనిదో ; ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము
ఇవన్ని గురువు ఆత్మగురించి బ్రహ్మము గురించి ముందు చెప్పినమాటలే. ఇప్పుడు గురువు ఆ బ్రహ్మమే నీవు అని గ్రహించుము అంటూ శిష్యుడికి మళ్ళీ
మళ్ళీ బోధిస్తున్నాడు.
॥ఓమ్ తత్ సత్