!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 252-253

||ఓమ్ తత్ సత్||


 

వివేకచూడామణి శ్లోకము 252 -253

 

ఇక్కడ బ్రహ్మము గురించి మళ్ళీ విశదీకరిస్తున్నాడు గురువు;

 

ఇప్పటిదాకా తత్ త్వమ్ అసిఆని - ఆ బ్రహము నువ్వే అని గురువు చెప్పిన తరువాత, - శిష్యుడికి - ఆహా  అహం బ్రహ్మాస్మి- అంటే  నేనే ఆ బ్రహ్మము అనే అలోచన రావాలి; అదే ఇక్కడ చెప్పేమాట.

 

ఆత్మ అన్నా, బ్రహ్మము అన్నా ఒకటే అనే మాట మనసులో వుంచుకొని ఈ శ్లోకము చదవాలి;

 

ఇందులో ఛాందోగ్యోపనిషత్తులో  - గురువు ఉద్దాలకుడు శిష్యుడు శ్వేతకేతువుకి చెప్పిన మాట "అస్థూలమ్ అనణ్వన్ అహ్రస్రమ్ అదీర్ఘమ్" - ఆత్మ స్థూలము కాదు, అణువైనది కాదు, పొట్టిది కాదు, పొడవైనది కాదు అన్న వాక్యాన్ని గుర్తు చేస్తూ, గురువు 252 శ్లోకము మొదలెడతాడు.

 

252 శ్లోకము:

 

అస్థూలమ్ ఇత్యేతత్ అసన్నిరస్య

సిద్ధం స్వతోవ్యోమవదప్రతర్క్యమ్।

యతో మృషామాత్ర మిదం ప్రతీతమ్

జహీహియత్స్వాత్మతయా గృహీతమ్।

బ్రహ్మహమిత్యేవ విశుద్ధ బుధ్యా

విద్ధి స్వమాత్మానమ్ అఖణ్డ బోధమ్

 

ఇది ఆరు పాదాల శ్లోకము; రెండు పాదాలు ఒకసారి చదివి అర్థము చేసుకుందాము

 

1 అస్థూలమ్ ఇత్యేతత్ అసన్నిరస్య

   సిద్ధం స్వతోవ్యోమవదప్రతర్క్యమ్।

 

అస్థూలమ్ ఇత్యేతత్ -

స్థూలము కానిది అన్నమాటలతో

అసత్ నిరస్య - అసత్ అయిన స్థూల శరీరము నిషేధించి

 

ఇక్కడ గురువు శృతి వాక్యము మళ్ళీ చెపుతున్నాడు -  ఆ శ్రుతివాక్యము ఇలావస్తుంది;

అస్థూలమ్ అనణ్వన్ అహ్రస్వమ్ అదీర్ఘమ్ - ఆత్మ స్థూలము కాదు, అణువైనది కాదు, పొట్టిది కాదు, పొడవైనది కాదు ; గురువు అది గుర్తుచేస్తూ అందులో ముఖ్యమైనమాట గుర్తుచేస్తాడు.

 

ఆత్మ విషయములో స్థూలశరీరము మున్నగువి నిషేధించబడ్దాయి -

 

సిద్ధం స్వతోవ్యోమవదప్రతర్క్యమ్ -

వ్యోమవత్ అప్రతర్క్యమ్- ఆకాశము వలె -

ఊహించడానికి వీలుకాని ( తర్కించడానికి వీలులేని)

సిద్ధం స్వతః - ఆత్మ సిద్ధించబడినది

 

స్థూలము కానిది అన్నమాటలతో అసత్ అయిన స్థూల శరీరము నిషేధించి , ఆకాశము వలె ఊహించడానికి వీలుకాని (తర్కించడానికి వీలులేని) ఆత్మ సిద్ధించబడినది

 

వేదాలలో చెప్పబడిన స్థూలము కానిది శ్రుతివాక్యము ద్వారా , అసత్ అయిన స్థూలశరీరము వదిలేసి , అకాశము వలె ఊహించడానికి వీలు లేని  ఆత్మ సిద్ధించబడినది.

 

2 యతో మృషామాత్ర మిదం ప్రతీతమ్

   జహీహియత్స్వాత్మతయా గృహీతమ్।

 

యతో మృషామాత్ర మిదం ప్రతీతమ్-

ఏది ( ఏ స్థూలశరీరము) మిథ్యా మాత్రముగా ఇదే ( ఆత్మ) అని ప్రసిద్ధి పొందినదో

 

జహీహియత్స్వాత్మతయా గృహీతమ్ -

జహీహి యత్  స్వాత్మతయా గృహీతమ్-

ఎదైతే ఆత్మగా భావించబడినదో దానిని వదిలేసేయ్ ।

 

గురువు : "ఏ స్థూలశరీరము మిథ్యా మాత్రముగా ఇదే ఆత్మ అని ప్రసిద్ధి పొందినదో, ఎదైతే ఆత్మగా భావించబడినదో దానిని వదిలేసేయ్ ":  స్థూల శరీరము ఆత్మకాదు అని మనకి తెలిసినమాటే. - జహీహి అంటే వదిలి వేయుము అని.

 

వదిలేసి ఏమి చెయ్యాలి అన్నమాటకి సమాధానము, ఆఖరి పాదములో

 

 3 బ్రహ్మహమిత్యేవ విశుద్ధ బుధ్యా

    విద్ధి స్వమాత్మానమ్ అఖణ్డ బోధమ్

 

బ్రహ్మ అహమ్ ఇతి ఏవమ్ విశుద్ధ బుద్ధ్యా -

విశుద్ధ జ్ఞానము కల బుద్ధితో ఆ బ్రహ్మము నేనే అని,

 

స్వమాత్మానమ్ అఖణ్డ బోధమ్ విద్ధి

నీ ఆత్మనే అఖండ జ్ఞాన స్వరూపముగా తెలిసికొనుము:

 

అంటే -

 

ఏ స్థూలశరీరము మిథ్యా మాత్రముగా ఇదే ఆత్మ అని ప్రసిద్ధి పొందినదో దానిని - వదిలేసి -  విశుద్ధ జ్ఞానము కల బుద్ధితో  ఆ బ్రహ్మము నేనే అని గ్రహించి, నీ ఆత్మనే అఖండ జ్ఞాన  స్వరూపముగా తెలిసికొనుము:

 

ఇక్కడ విశుద్ధ బుద్ధ్యా అన్నప్పుడు మనన ధ్యానాదులచే పదును చెక్కబడిన బుద్ధితో అని; అదే మనము క్లుప్తముగా విశుద్ధ జ్ఞానము కల బుద్ధితో అని అంటాము.

 

పూర్తిశ్లోకతాత్పర్యము:

 

వేదాలలో చెప్పబడిన స్థూలము కానిది శ్రుతివాక్యము ద్వారా , అసత్ అయిన స్థూలశరీరము వదిలేసి , అకాశము వలె ఊహించడానికి వీలు లేని  ఆత్మ సిద్ధించబడినది.

 

ఏ స్థూలశరీరము మిథ్యా మాత్రముగా ఇదే ఆత్మ అని ప్రసిద్ధి పొందినదో దానిని - వదిలేసి -  విశుద్ధ జ్ఞానము కల బుద్ధితో  ఆ బ్రహ్మము నేనే అని గ్రహించి, నీ ఆత్మనే అఖండ జ్ఞాన స్వరూపముగా తెలిసికొనుము:

 

తత్త్వమసి, నీవే ఆ బ్రహ్మము, అని గురువు చెప్పినప్పుడు- శిష్యుడు శ్రుతి వాక్యములను అనుసరించి, ఈ స్థూలశరీరము ఆత్మ కాదు అని అది వదిలేసి, మనన ధ్యానాదులచే పదును చేయబడిన బుద్ధితో , ఆ బ్రహమము నీవే అన్న మాటతో , ఆ బ్రహమము నేనే అని గ్రహించి , ఆత్మయే అఖండ జ్ఞాన స్వరూపముగా తెలిసికొనవలెను అని - గురువు వాక్యము.

 

వివేకచూడామణి  శ్లోకము 253

 

మృత్కార్యం సకలం ఘటాది సతతమ్ మృన్మాత్రమేవాహితమ్

తద్వత్ సజ్జనితం  సదాత్మకమిదం  సన్మాత్రమేవాఖిలమ్।

యస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్ సత్యం స ఆత్మా స్వయం

తస్మాత్ తత్త్వమసి ప్రశాన్తమమలం బ్రహ్మాద్వయం యత్పరమ్॥

 

 

1 మృత్కార్యం సకలం ఘటాది సతతమ్ మృన్మాత్రమేవాహితమ్

 

మృత్కార్యం సకలం - మట్టి యొక్క కార్యమైనది అన్నీ

ఘటాది సతతమ్ - కుండ మొదలగునవి ఎల్లప్పుడు

మృన్మాత్రమేవాహితమ్ - అన్నివిధాలముగా మట్టి మాత్రమే

 

మట్టి యొక్క కార్యమైనది అన్నీ కుండ మొదలగునవి ఎల్లప్పుడు అన్నివిధాలముగా మట్టి మాత్రమే

 

2 తద్వత్ సజ్జనితం  సదాత్మకమిదం  సన్మాత్రమేవ అఖిలమ్

 

తద్వత్ సజ్జనితం - ఆ విధముగనే సత్ నుండి పుట్టినదియు

సదాత్మకమిదంఆఖిలమ్ - సత్ ప్రధానముగా కలదియు అగు సమస్తము

సన్మాత్రమేవ - సత్ తో కూడినదే

 

ఆ విధముగనే సత్ నుండి పుట్టినదియు , సత్ ప్రధానముగా కలదియు అగు సమస్తము, సత్ తో కూడినదే.

 

సత్ అంటే అన్ని అవస్థలలో మారనిది అదే సత్యము అదే బ్రహ్మము. .

 

అంటే ఇక్కడ పైన చెప్పబడిన మాట ఇలా వర్తిస్తుంది:  ఆ విధముగనే బ్రహ్మము నుండి పుట్టినదియు , బ్రహ్మము ప్రధానముగా కలదియు అగు సమస్తము, బ్రహ్మము తో కూడినదే. అది మనము విన్నమాటే.

 

3 యస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్ సత్యం స ఆత్మా స్వయం

 

యస్మాత్ సతః పరం నాస్తి కిమపి

ఏందువలన సత్ ( అయిన బ్రహ్మము) కన్న భిన్నమైనది ఏదీ లేదో

తత్ సత్యం - ఆ సత్యము

స ఆత్మా స్వయం - అదియే నీయొక్క ఆత్మస్వరూపము

 

ఏందువలన సత్ ( అయిన బ్రహ్మము) కన్న భిన్నమైనది ఏదీ లేదో ఆ సత్యము ( బ్రహ్మము) అదియే నీ యొక్క ఆత్మస్వరూపము

 

4 తస్మాత్ తత్త్వమసి ప్రశాన్తమమలం బ్రహ్మాద్వయం యత్పరమ్

 

తస్మాత్ - అందువలన

తత్ - ఆ

ప్రశాన్తమమలం - ప్రశాంతమైన మలము లేనట్టి ( వికారశూన్యమైన శుద్ధ చైతన్న్యమైన)

యత్ పరం -ఏ బ్రహ్మము కలదో

అద్వయమ్  బ్రహ్మమ్-  అద్వితీయమైన - తన కన్న భిన్నమైనది లేని- బ్రహ్మము

 త్వం అసి -  నీవే।

 

అందువల ఆ ప్రశాంతమైన శుద్ధ చైతన్న్యమైన ఏ బ్రహ్మము కలదో ఆ అద్వితీయమైన బ్రహ్మము నీవే।

 

పూర్తి తాత్పర్యము:

 

మట్టి యొక్క కార్యమైనది అన్నీ కుండ మొదలగునవి ఎల్లప్పుడు అన్నివిధాలముగా మట్టి మాత్రమే ; ఆ విధముగనే సత్ నుండి పుట్టినదియు , సత్ ప్రధానముగా కలదియు అగు సమస్తము, సత్ తో కూడినదే ; ఏందువలన సత్ ( అయిన బ్రహ్మము) కన్న భిన్నమైనది ఏదీ లేదో ఆ సత్యము ( బ్రహ్మము) అదియే నీ యొక్క ఆత్మస్వరూపము, అందువల ఆ ప్రశాంతమైన శుద్ధ చైతన్న్యమైన ఏ బ్రహ్మము కలదో ఆ అద్వితీయమైన బ్రహ్మము నీవే।

 

॥ఓమ్ తత్ సత్॥

 

 

 

 






























































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251
వివేక చూడామణి శ్లోకములు 252-253


Om tat sat !

 

 

 

    •