!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 308-310
॥ఓమ్ తత్ సత్॥
వివేక చూడామణి 308-310 శ్లోకములు:
గురువు ఇంకా అహంకారము వదలాలి అన్నమాట మీద మళ్ళీ
మళ్ళీ చెపుతాడు ఈ మూడు శ్లోకాలలో.
శ్లోకము 308
తస్మాత్ అహంకారం ఇమం స్వశత్రుం
భోక్తుర్గళే కటవత్ ప్రతీతమ్।
విచ్ఛిద్య విజ్ఞాన మహాసినా స్ఫుటమ్
భుఙ్క్షాత్వ సామ్రాజ్య సుఖం యథేష్ఠం॥308॥
1 తస్మాత్ అహంకారం ఇమం స్వశత్రుం -
అందువలన అహంకారమనబడే ఈ నీ శత్రువుని
2 భోక్తుర్గళే కటవత్ ప్రతీతమ్। -
కంఠములో గుచ్చుకున్న ముల్లువలె
భావించబడుచున్న
అందువలన కంఠములో గుచ్చుకున్న ముల్లువలె భావించబడుచున్న
అహంకారమనబడే ఈ నీ శత్రువుని తీసిపారేసేయ్.
3 విచ్ఛిద్య విజ్ఞాన మహాసినా స్ఫుటమ్
విజ్ఞానమనబడెడి తీక్ష్ణ మైన
కత్తితో నాశనము చేసి
4 భుఙ్క్ష్వాత్మ సామ్రాజ్య సుఖం యథేష్ఠం
ఆత్మ సామ్రాజ్య సుఖం యథేష్ఠం భుంక్ష్వ -
ఆత్మ సామ్రాజ్య సుఖమును అడ్డులేకుండా
అనుభవింపుము:
అహంకారమనేబడే ముల్లుని తీసేస్తే నిరంతర అఖండ ఆనందమును
యథేచ్ఛగా అనుభవించుము అని గురు ఉపదేశము.
308 శ్లోక తాత్పర్యము:
"అందువలన కంఠములో గుచ్చుకున్న ముల్లువలె
భావించబడుచున్న అహంకారమనబడే ఈ నీ శత్రువుని
తీసిపారేసి, ఆత్మ సామ్రాజ్య సుఖము అంటే నిరంతర అఖండ
ఆనందమును అడ్డులేకుండా అనుభవింపుము"
శ్లోకము 309
తతోఽహమాదేః వినివృత్య వృత్తిమ్
సంత్యక్త రాగః పరమార్థలాభాత్।
తూష్ణీం సమాస్వాత్మ సుఖానుభూత్వా
పూర్ణాత్మనా బ్రహ్మణి నిర్వికల్పః॥309॥
1 తతోఽహమాదేః వినివృత్య వృత్తిమ్ -
పిమ్మట అహంకారము మున్నగు వాటినుంచి మనస్సుని మరలించి
2 సంత్యక్త రాగః పరమార్థలాభాత్।
పరమార్థము గ్రహించి విడువబడిన రాగద్వేషములు
కలవాడై
3 తూష్ణీం సమాస్వ ఆత్మ సుఖానుభూత్వా
ఆత్మ సుఖము అనుభవిస్తూ తూష్ణీభావము పొందుము
తూష్ణీభావము పొందుము - అంటే క్రియారహితుడవు కమ్ము అని.
4 పూర్ణాత్మనా బ్రహ్మణి నిర్వికల్పః -
పూర్ణస్వరూపముతో బ్రహ్మయందు నిర్వికల్ప రూపుడవై
వుండుము
తాత్పర్యము:
"పిమ్మట అహంకారము మున్నగు వాటినుంచి మనస్సుని మరలించి,
పరమార్థము గ్రహించి విడువబడిన రాగద్వేషములు కలవాడై,
పూర్ణస్వరూపముతో బ్రహ్మయందు నిర్వికల్ప రూపుడవై, ఆత్మ
సుఖము అనుభవిస్తూ క్రియారహితుడవు కమ్ము"
శ్లోకము 310:
స మూల కృత్తోపి మహానహం పునః
వుల్లేఖితః స్యాత్ యది చేతసా క్షణం
సంజీవ్య విక్షేప శతం కరోతి
న భస్వతా ప్రావృషి వారిదో యథా॥310॥
1 స మూల కృత్తోపి మహానహం పునః -
సమూలముగా ఛేధించబడిననూ ఈ మహత్తరమైన అహంకారము..
అహంకారము చాలామహత్తరమైనది. ఎందుకు ? అది ఎన్నో
కొమ్మలున్న మహావృక్షములాంటిది. ఆ వృక్షాన్ని
కొట్టేశినా మళ్ళీ ఎక్కడో చిగుళ్ళూ కనిపిస్తాయి. అలాగే
అహంకారము మళ్ళీ మళ్ళీ పైకి లేస్తో ఉంటుంది
2 వుల్లేఖితః స్యాత్ యది చేతసా క్షణం-
మనస్సు చేత ఒక క్షణము చిగురింపచేయబడినచో ..
అహంకారము సమూలముగా ఛేధింపబడిననూ, మనస్సుచేత ఒక క్షణము
చిగురింపచేయబడినచో , అది మళ్ళీ విజృంభిస్తుంది అని
తాత్పర్యము.
3 సంజీవ్య విక్షేప శతం కరోతి -
మరల ఉత్పన్నమై వందలకొలది చిగుళ్ళను చేయును
4 నభస్వతా ప్రావృషి వారిదో యథా-
వర్షాకాలములో వాయువు చేత విచ్చిన్నమైన మేఘములు
మళ్ళీ కూడు కొని కుండపోతు వాన కురిసినట్లు
310 వ శ్లోకము తాత్పర్యము:
"వర్షాకాలములో వాయువు చేత విచ్చిన్నమైన మేఘములు మళ్ళీ
కూడుకొని కుండపోతు వాన కురిపించినట్లు, సమూలముగా
ఛేధించబడిననూ ఈ మహత్తరమైన అహంకారము, మనస్సు చేత ఒక
క్షణము చిగురింప చేయబడినచో, మరల ఉత్పన్నమై వందలకొలది
చిగుళ్ళను చేయును;"
________________________________________________
గురువు ఇంకా అహంకారము వదలాలి అన్నమాట మీద మళ్ళీ
మళ్ళీ చెపుతాడు ఈ మూడు శ్లోకాలలో.
__________________________________________________