!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 311-313
॥ఓం తత్
సత్॥
వివేక
చూడామణి 311-313 శ్లోకములు:
ఇప్పటి దాకా అహంకారము వదిలెయ్యాలి
కుండబద్దలుకొట్టినట్లు చెప్పాడు. ఇక అహంకారము ఎలా
ఆపాలి అన్నమాట మీద గురువు చెపుతాడు. అహంకారము ఆపడానికి
విషయములమీద ఆలోచన కారణము - ఆ "విషయానుచింత" కి తావు
ఇవ్వకూడదు అన్నమాట. అదే వింటాము ఇక్కడ.
శ్లోకము 311:
నిగృహ్య శత్రోహమోఽవకాశః
క్వచిన్నదేయో విషయానుచిన్తయా।
స ఏవ సంజీవనహేతురస్య
ప్రక్షీణ జంబీరతరోరివామ్బు॥
1నిగృహ్య శత్రోహమోఽవకాశః-
నిగృహ్య శత్రోః అహమో -
శత్రువైన అంకారమును నిగ్రహించి,
2 క్వచిన్నదేయో విషయానుచిన్తయా -
క్వచిత్ న దేయో అవకాశః - కొంచెము
కూడా అవకాశము ఇవ్వరాదు
విషయానుచిన్తయా - విషయముల పై ఆలోచనలతో
అహంకారము ను నిగ్రహించి - ఆ అహంకారానికి కొంచెమైన
అవకాశము ఇవ్వరాదు
3 స ఏవ సంజీవన హేతురస్య-
అదే దీనికి సంజీవన కారణము:
అహంకారానికి ప్రాణము పోసే సంజీవని విషయాలపై ఆలోచనయే.
అలాంటి సంజీవనికి కొంచెము కూడా అవకాశము ఇవ్వరాదు అని
గురువు మాట. విషయాలపై అలోచన లేకపోతే నేను నాది అన్న
భావము రాదు. విషయచింతనవలననే సంసార భాధలకలుగుచున్నది.
అందువలన గురువు చెప్పే మాట విషయాలపై అలోచన వద్దు. ఆ
ఆలోచనే అహంకారాని కి ప్రాణము పోస్తుంది అని. దానికి
ఉదాహరణ ఎండి పోయే నిమ్మచెట్టుకి నీళ్ళు.
4 ప్రక్షీణ జంబీర తరోః ఇవామ్బు:
ప్రక్షీణ జమ్బీర తరోః - ఎండి పోయిన నిమ్మచెట్టు కి
అమ్బు ఇవ - నీళ్ళుపోసినట్లు.
ఎండి పోయిన నిమ్మచెట్టు కి నీళ్ళుపోసి ప్రాణము
ఇచ్చినట్లు, విషలమీద ఆలోచనతో అహంకారానికి ప్రాణము
ఇస్తున్నామి అన్నమాట. అదే వద్దు అని గురువు మాట.
211 వ శ్లోక తాత్పర్యము:
శత్రువైన అంకారమును నిగ్రహించి, విషయముల పై
ఆలోచనలతో, ఎండి పోయిన నిమ్మచెట్టు కి
నీళ్ళుపోసినట్లు, కొంచెము కూడా అవకాశము
ఇవ్వరాదు.
శ్లోకము 212
దేహాత్మనా సంస్థిత ఏవ కామీ
విలక్షణః కామయితా కథం స్యాత్।
అతోఽర్థసంధానపరత్వమేవ
భేదప్రసక్త్యా భవబన్ధహేతుః॥
దేహాత్మనా సంస్థిత ఏవ కామీ:
దేహమే ఆత్మ అనే బుద్ధితో వున్నవాడే కామవంతుడు:
విలక్షణః కామయితా కథం స్యాత్-
అలాంటి లక్షణము లేనివాడు కామవంతుడు ఎలా అగును?
దేహమే ఆత్మ అనే బుద్ధితో వున్నవాడే కామవంతుడు -
కోరికలు కలవాడు. అలాంటి లక్షణము లేనివాడు కామవంతుడు
ఎలా అగును? నిరంతర ఆనంద స్వరూపము గలవానికి క్షణిక
ఆనందానికి కారణమైన విషయాలపై కోరిక కలుగదు.
3 అతోఽర్థసంధానపరత్వమేవ
అందువలన విషయములపై ఆలోచనయే;
4 భేదప్రసక్త్యా భవబన్ధహేతుః -
భేదబుద్దిని పెంచుటద్వారా సంసార బంధనముకు
కారణము;
అందువలన విషయములపై ఆలోచనయే దేహాదులందు అహంకారము
కలిగించి, ఆ దేహమే ఆత్మ అనే బుద్దిని పెంచి, సంసార
బంధనముకు కారణము అగుచున్నది. భేదబుద్ది అనడములో
దేహభ్రాన్తి కల బుద్ధి అని భావన
తాత్పర్యము:
దేహమే ఆత్మ అనే బుద్ధితో వున్నవాడే కోరికలు గలవాడు -
కామవంతుడు. అలాంటి లక్షణము లేనివాడు కామవంతుడు ఎలా
అగును? అందువలన విషయములపై ఆలోచనయే
భేదబుద్దిని పెంచుటద్వారా సంసార బంధనముకు కారణము
శ్లోకము 213
కార్యప్రవర్ధనాత్
బీజప్రవృద్ధిః పరిదృశ్యతే ।
కార్యనాశాత్ బీజనాశః
తస్మాత్ కార్యం నిరోధయేత్॥
1 కార్యప్రవర్ధనాత్
కార్యము వృద్ధి పొందుటవలన;
బీజప్రవృద్ధిః పరిదృశ్యతే ।
బీజములయొక్క వృద్ధి కనపడుచున్నది.
చిగురు, దానితో కొమ్మలు, కొమ్మలద్వార
చెట్టు వృద్ధి చూస్తాము. ఆ వృక్షముయొక్క
వృద్ధితో పుష్పములు, ఫలములు వస్తాయి . ఆ ఫలములద్వారానే
కదా మళ్ళీ బీజము వస్తుంది. అంటే కార్యము వృద్ధి
వలన బీజములయొక్క ప్రవృద్ధి కనపడుచున్నది అన్నమాట.
ఆ చెట్టుని నరికేస్తే ఫలములసంగతి వుండదు, బీజముల
ప్రశక్తి వుండనే వుండదు. అంటే కార్యము నాశనమైతే బీజము
కూడా నాశనము అవుతుంది అన్నమాట. అదే మూడవ పాదములో
వింటాము
3 కార్యనాశాత్ బీజనాశః
కార్యనాశనము వలన బీజనాశనము (
కనపడువచున్నది)
4 తస్మాత్ కార్యం నిరోధయేత్
అందువలన కార్యమును నిరోధింపవలెను.
ఇక్కడ గురువు చిగురు కొమ్మకాకుండా చేయుము అని
ఉపదేశిస్తున్నాడు.
313 వ శ్లోకము తాత్పర్యము:
కార్యము వృద్ధి పొందుటవలన; బీజములయొక్క వృద్ధి
కనపడుచున్నది. కార్యనాశనము వలన బీజనాశనము
కనపడువచున్నది. అందువలన కార్యమును నిరీధింపవలెను.
ఇక్కడ కార్యము బీజము అంటూ చెప్పబడినది. దీనికి విషయ
వాంఛలకి , విషయ వాసనలకి సంబంధము ఏమిటి అంటే కార్యమే
విషయవాంఛలు, బీజమే విషయ వాసనలు>
అదే మాట కొంచెము విశదీకరిస్తూ ఇలా చెప్పవచ్చు.
ఒక విత్తునుండి పుట్టిన చెట్టును ( కార్యమును)
ఎదగనిచ్చినచో ఆ చెట్టునుంచి వెలకొలదీ
విత్తనములు( బీజములు) పుట్టుట చూచుచున్నాము.
(పూర్వ వాసనలు) అనే బీజము వలన కలిగిన విషయ ప్రవృత్తి
అనే కార్యము ( చెట్టు), పెరిగి , మరి కొన్ని
బీజములకు ( వాసనలకు) కారణమగుమను.
కార్యమును( విషయవాంఛలు అనే చెట్టును) మొదటిలోనే
నాశనము చేయుటవలన దానివలన వచ్చే బీజములు కూడా
నాశనమగును.
అందువలన కార్యములను ముందుగానే నిరోధీమ్చవలెను- అని
భావము.
॥ఓం తత్ సత్॥
_______________________________________________