!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 321-323
వివేక
చూడామణి 321-323 శ్లోకములు:
శ్లోకము 321:
దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్
స్వయమ్ సన్మాత్రమానన్దఘనం విభావయన్।
సమాహితస్సన్ బహిరన్తరం వా
కాలం నయేథా స్సతి కర్మబన్ధే॥321॥
దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ -
దృశ్యప్రపంచమును బ్రహ్మములో విలీనమ్
చేసి
స్వయమ్ సన్మాత్రమానన్దఘనం విభావయన్-
తాను సత్ స్వరూపమైన అనంద ఘనస్వరూపముగా
భావించుచూ
సమాహితః సన్ బహిరన్తరం వా -
లోపలగాని వెలుపల గాని ఏకాగ్రచిత్తము
కలవాడై
కాలం నయేథా స్సతి కర్మబన్ధే -
కర్మబంధములు ఉన్నంతవఱకు కాలము గడుపుము
తాత్పర్యము:
దృశ్యప్రపంచమును బ్రహ్మములో విలీనము
చేసి , తాను సత్ స్వరూపమైన అనంద ఘనస్వరూపముగా
భావించుచూ, కర్మబంధములు ఉన్నంతవఱకు లోపలగాని వెలుపల
గాని ఏకాగ్రచిత్తము కలవాడై కాలము గడుపుము
ప్రారబ్ధకర్మ వున్నంతవఱకు -
జీవించుచున్న కాలము అంతా - దృశ్య ప్రఫంచము అంతా
బ్రహ్మమే అని భావించుచూ - బాహ్య అంతరములను
నిశ్చలపఱచి - జీవించుము.
ముందు శ్లోకాలలో క్రియానాసనము వలన
వాసనా క్షయము అవుతుంది. వాసనా క్షయమే మోక్షము అదే
జీవన్ముక్తి అని చెప్పాడు గురువు. ప్రారబ్ధ
కర్మ ఉన్నవాడు వాసనాక్షయముతో మోక్షము అదే
జీవన్ముక్తి అని చెప్పాము గదా - అట్టివాడి
జీవనము ఎలాగా , ఆ జీవన్ముక్తిగా జీవించడము
ఎలాగ అన్న ప్రశ్నకి ఇది సమాధానము. - ప్రారబ్ధకర్మ
వున్నంతవఱకు - జీవించుచున్న కాలము అంతా - దృశ్య
ప్రఫంచము అంతా బ్రహ్మమే అని భావించుచూ - బాహ్య
అంతరములను నిశ్చలపఱచి - జీవించుము.
శ్లోకము 322:
ప్రమాదో బ్రహ్మ నిష్ఠాయాం
న కర్తవ్యః కదాచన।
ప్రమాదో మృత్యుః ఇత్యాహ
భగవాన్ బ్రహ్మణః సుతః॥ 322॥
ప్రమాదో బ్రహ్మ నిష్ఠాయాం-
బ్రహ్మనిష్ఠలో మతి మరుపు
న కర్తవ్యః కదాచన -
ఎప్పుడును చేయకూడదు
మతిమరుపు దేనిని గురించి - నేనే ఆ
బ్రహ్మము అన్న సంగతి మరచిపోకుండా - దృశ్యప్రపంచములో
అంతా బ్రహ్మమే చూడవలెను అని భావము. తాను
బ్రహ్మము అని మరచిపోయిన నాడు, అలోచనా ప్రవాహములో
మోహములు పుట్టును. మోహముల ద్వారా అహంకారము
విజృంభించును. అప్పుడు బ్రహ్మతత్త్వము
పూర్తిగా పోవును అన్నమాట.
ప్రమాదో మృత్యుః ఇత్యాహ -
మతి మరుపు మృత్యువుతో సమానమని ఇట్లు
చెప్పెను
భగవాన్ బ్రహ్మణః సుతః -
భగవాన్ బ్రహ్మ కుమారుడు (
సనత్కుమారుడు)
తాత్పర్యము:
బ్రహ్మనిష్ఠలో వున్నవారు మతి మరుపు
ఎప్పుడును చేయకూడదు. మతి మరుపు మృత్యువుతో సమానమని
సనత్కుమారుడు చెప్పెను
శ్లోకము 323
న ప్రమాదాదనర్థోఽన్యో
జ్ఞానినః స్వ స్వరూపతః।
తతో మోహః తతోఽహంధీః
తతోబన్ధః తతోవ్యథా॥ 323॥
న ప్రమాదాదనర్థోఽన్యో -
మతి మరుపు కన్న అనర్థము లేదు;
జ్ఞానినః స్వ స్వరూపతః। - జ్ఞానులకు
తమ స్వ స్వరూపము
జ్ఞానులకు తమ స్వ స్వరూపము మతి మరుపు
కన్న అనర్థము లేదు.
తతో మోహః తతోఽహంధీః -
అప్పుడే మోహము అప్పుడే అహంభావము
తతోబన్ధః తతోవ్యథా
అప్పుడె బంధములు - అప్పుడే చింతన.
తాత్పర్యము:
జ్ఞానులకు తమ స్వ స్వరూపము మతి మరుపు
కన్న అనర్థము లేదు. అప్పుడే మోహము అప్పుడే అహంభావము
- అప్పుడే బంధములు - అప్పుడే చింతన.
॥ఒమ్ తత్ సత్॥
______________________________