!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 324-326
వివేక చూడామణి 324-326 శ్లోకములు:
శ్లోకము 324:
విషయాభిముఖం దృష్ట్వా
విద్వాంసమపి విస్మృతః।
విక్షేపయతి ధీదోషైః
యోషా జారమ్ ఇవ ప్రియమ్ ॥
1 విషయాభిముఖం దృష్ట్వా -
విషయాభిముఖునిగా చూచి;
విషయాభిముఖముగా అంటే, తనలో వున్న ఆత్మని మరిచిపోయి,
ఇన్ద్రియములను ఉత్తేజపరచు దృశ్యప్రపంచములో మునిగి పోయే
వాడు అని
2 విద్వాంసమపి విస్మృతః -
విద్వాంసునిని కూడా మతి మరుపు;
విషయాభి ముఖునిగా చూచి విద్వాంసునిని కూడా మతిపరుపు ఏఓ
చేస్తుంది ? విద్వాంసుని నశింపచేయును అని గురువు
ఉపదేశము. అంటే విషయప్రపంచములో మునిగినవాడు,
అలాంటి వాడు విద్వాంసుడైనా గాని మతిమరుపులో
దృశ్యమంతా బ్రహ్మమే అని మరిచిపోతే - చివరికి ఆ విషయ
ప్రపంచములోనే వుండిపోయి, అధ్యాత్మికముగా నాశనమౌతాడు
అని భావము. ఆ నాశనము ఎలావస్తుంది అన్నమాట ముందు
పాదములో వస్తుంది.
3 విక్షేపయతి ధీదోషైః - ధీదోషైః విక్షేపయతి -
బుద్ధి దోషములతో (ఆత్మజ్ఞానమును) నశింపచేయును;
విషయాభి ముఖునిగా చూచి విద్వాంసునిని కూడా మతిపరుపు
బుద్ధిదోషములతో నశింపచేయును. ఇక్కడ మతిపమరుపు
అన్నప్పుడు ఆ మతిమరుపు బ్రహ్మజ్ఞానములో అని అనుకుంటే
అది బుద్ధిదోషములతో ఆత్మ జ్ఞానమును నశింపచేయును అని.
ముందు శ్లోకాలలో చెప్పినట్టు బ్రహ్మ జ్ఞానములో
మతిమరుపు వినాశ కారణము. దానికి ఉదాహరణ చెపుతాడు.
4 యోషా జారమ్ ఇవ ప్రియమ్-
స్త్రీ అన్యాసక్తుడైన ప్రియుని వలె;
ఒక స్త్రీ అన్యమనస్కుడైన ప్రియుని విడిచినట్లు:
224 శ్లోక తాత్పర్యము:
విషయాభి ముఖునిగా చూచి విద్వాంసునిని కూడా మతిపరుపు,
ఒక స్త్రీ అన్యమనస్కుడైన ప్రియుని విడిచినట్లు,
బుద్ధిదోషములతో ఆత్మ జ్ఞానమును నశింపచేయును.
ఇదే మాటకి ఇంకో ఉదాహరణ చెపుతాడు గురువు.
శ్లోకము 325:
యథాపకృష్టం శైవాలమ్
క్షణమాత్రం న తిష్ఠతి ।
అవృణోతి యథా మాయా
ప్రాజ్ఞం వాపి పరాఙ్ముఖం ॥
1 యథా అపకృష్టం శైవాలమ్
ఏ విధముగా లాగబడిన నాచు;
2 క్షణమాత్రం న తిష్ఠతి -
ఒక క్షణము కూడా నిలబడదు;
ఐక్కడ గురువు ఉదాహరణ చెపుతున్నాడు. ఒక చెరువులో నాచు
నీళ్లని అంతా కప్పుతుంది. అలాంటి చెరువులో నాచు
కొంచెము పక్కకి తొలగించి నీరు కనపడినా , ఆ నాచుని
వదిలెయ్యగానే మళ్ళీ నాచు వెనక్కి వచ్చేసి నీరును
కప్పివేస్తుంది. అలాగే, ప్రపంచ విషయాలలో పడిన వాడిని
మాయ కప్పివేస్తుంది, నాచు చెరువులో నీళ్ళని
కప్పినట్లు.
వాడిని మాయ కప్పివేస్తుంది అంటే - ఆత్మని కప్పివేసి,
అంతర్ముఖముగా పోయే ఆలోచనలని ఆపుతుంది అని.
3 ప్రాజ్ఞం వాపి పరాఙ్ముఖం
ప్రాజ్ఞుడైననూ బహిర్ముఖము కలవానిని;
4 అవృణోతి యథా మాయా
మాయ కప్పివేయును.
బహిర్ముఖము కలవాడు అంటే వాడి ఇన్ద్రిలయాలన్నీ ఆసక్తి
కలవై వుంటాయి. అట్టి వాడిని మాయ కప్పివేయడము ఎంత
సులభమో చెప్పనక్కరలేదు. దానికి ఇంకో ఉదాహరణ వస్తుంది.
325 వ శ్లోక తాత్పర్యము:
ఏ విధముగా లాగబడిన నాచు ఒక క్షణము కూడా నిలబడదో, అలాగే
ప్రాజ్ఞుడైననూ బహిర్ముఖము కలవానిని మాయ కప్పివేయును.
ఇక్క ప్రాజ్ఞుడైనా అన్నమాటలో తెలిసేది, వాడు
పండితుడైనా అని. కాని వాడి ధ్యాస ప్రపంచ విషయాలలో
వుంటే (బహిర్ముఖుడైతే) మాయవాడిని, సులభముగా ఆ ప్రపంచ
విషయాలలోనే వుండేటట్లు - ఆత్మజ్ఞానాన్ని కపివేస్తుంది
అన్నమాట.
శ్లోకము 326:
లక్షచ్చ్యుతం చేత్ యది చిత్తమీషద్
బహిర్ముఖం సన్నిపతేత్ తతస్తతః।
ప్రమాదతః ప్రచ్యుత కేలికన్దుకః
సోపానపఙ్కౌ పతితో యథా తథా॥
1 లక్షచ్చ్యుతం చేత్ యది చిత్తమీషద్-
యది చిత్తం ఈషద్ లక్షచ్చ్యుతం చేత్ -
ఒకవేళ మనస్సు లక్ష్యము వదిలినచో ;
మన లక్ష్యము బ్రహ్మజ్ఞానము మీద వుండాలి . ఒకవేళ మన
మనస్సు లక్ష్యము వదిలినచో - అంటే - మనస్సు
బ్రహ్మమునుండి తొలగినచో అని . మన మనస్సు బ్రహ్మము మీది
నుంచి తొలగితే , ఇక ప్రశ్నే లేదు - వెంటనే
మనస్సు మనకి కనపడే దృశ్యప్రపంచములోకి వెళ్ళి
పోతుంది.
2 బహిర్ముఖం సన్నిపతేత్ తతస్తతః।
బహిర్ముఖముగా వెంటనే పడును;
ఒకవేళ మనస్సు లక్ష్యమైన బ్రహ్మమునుండి తొలగినచో
బహిర్ముఖముగా వెంటనే పడును. అంటే మనకి కనపడే దృశ్య
ప్రపంచములోకి పోతుంది. ఏలా వెళ్ళుతుంది
అన్నమాటకి
ఉదాహరణ చెపుతాడు - మెట్లమీదనుంచి
కింది దొర్లిన బంతి వలె - దాన్ని మళ్ళీ పట్టుకోలేము !
3 ప్రమాదతః ప్రచ్యుత కేలికన్దుకః
ప్రమాదవశముగా జారిన ఆట బంతి;
4 సోపానపఙ్కౌ పతితో యథా తథా
మెట్లయొక్క పంక్తి మీద పడినట్లుగా.
326 వ శ్లోకము తాత్పర్యము:
ప్రమాదవశముగా మెట్ల మీద జారిన బంతి ఎట్లు
పోవునో, అట్లే ఒకవేళ మనస్సు లక్ష్యమైన
బ్రహ్మమునుండి తొలగినచో మనస్సు బహిర్ముఖముగా వెంటనే
పడును.
మెట్లమీదనుంచి క్రిందపడే బంతి ఆపడము ఎంత అసాధ్యమో,
అలాగే బ్రహ్మము అనే లక్ష్యము నుంచి మనస్సు జారితే
దృశ్య ప్రపంచములోకి వెళ్ళకుండా ఆపడము అంత
కష్టము.
॥ఓం తత్ సత్॥
_______________________________________________
____________________________________________