!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 327-329
వివేక చూడామణి 327-329 శ్లోకములు:
గురువు 320వ శ్లోకమునుంచి చెపుతున్నమాట,
అప్రమత్తత మీద. బ్రహ్మనిష్ఠలో ప్రమాదము (మతి మరుపు)
అనర్థాలకి కారణమౌతుంది అని ఈ ఉపదేశము. ఈ మతిమరుపు
(బ్రహ్మ మొక్కటే అన్న మాట మీద) ఎవరికి వస్తుంది అన్నది
కూడా విశదీకరిస్తాడు. అది విషయాభిముఖులైనవారికి అని
సమాధానము. పండితులైనాగాని కొంచెము
విషయాభిముఖులైతే, వారిని ఆ గుణము వారిని
ముంచువేస్తుంది అని కూడా వింటాము. ఇక్కడ మూడు
శ్లోకాలలో మళ్ళీ అదే మాట ఉదాహరణలతో వింటాము.
శ్లోకము 327 & 328
విషయేష్వావిశచ్ఛేతః
సంకల్పయతి తత్ గుణాన్
సమ్యక్ సంకల్పనాత్ కామః
కామాత్ పుంసః ప్రవర్తనమ్॥327॥
తతః స్వరూప విభ్రంశో విభ్రష్టన్తు పతత్యధః।
పతితస్య వినా నాశం పునర్నారోహ ఈక్ష్యతే।
సంకల్పం వర్జయేత్ తస్మాత్ సర్వానర్ధస్య కారణమ్॥328॥
అవథ్యాని హి వస్తూని వ్యాధిగ్రస్తో యథోత్సృజేత్।
1 విషయేష్వావిశచ్ఛేతః - విషయేషు అవిశత్ చేతః
విషయములందు చిత్తము ఆసక్తి కలది అగుచు
2 సంకల్పయతి తత్ గుణాన్ -
ఆ గుణముల మీద సంకల్పము. చేయుచుండును;
3 సమ్యక్ సంకల్పనాత్ కామః -
ఆ దట్టమైన సంకల్పముతో కోరికి పుట్టును
4 కామాత్ పుంసః ప్రవర్తనమ్ -
ఆ కోరికతో మనుష్యుడు ప్రవర్తించును
ఇది మనము తఱచు విన్నమాట- సులభముగా అర్థమైన మాట.
విషయములందు ఆసక్తి గలమనస్సు వాటిపైన ఆలోచనలతో
వుంటుంది. ఆ అలోచనాప్రభావమే సంకల్పము. ఆ సంకల్పము వలన
వాటిపై కోరిక పుట్టుతుంది. ఆ కోరిక మనుష్యుడిని
కావలసిన కర్మలోకి అంటే క్రియకు తోస్తుంది.
ఈ అనాత్మ రూపమైన అనిత్యమైన కోరికలపై అలోచనలతో దానికి
కావలసిన క్రియలతో మానవుడు , తన స్వరూపము ( అత్మ)
మరిచిపోయి, బంధములనుంచి బయటపడడము మరచిపోయి, ఇంకా
బంధములోకి జారుకుంటాడు
5 తతః స్వరూప విభ్రంశో -
అప్పుడు తన స్వరూపము వదిలివేస్తాడు;
6 విభ్రష్టన్తు పతత్యధః - విభ్రష్టన్తు పతతి అధః -
(స్వరూపము నుండి) భ్రష్టుడై క్రిందకి
పడును;
విషయములందు ఆసక్తితో సంకల్పము, కోరిక, దాని కోసము చేసే
క్రియలతో చివరికి తన స్వరూపము నుంచి భ్రష్టుడై,
అంటే ఆత్మ స్వరూపమునకు దూరమైనవాడై, అనాత్మ విషయాలలోకి
పడును.
ఇక్కడ, మనస్సు విషయములందు ఆసక్తి కలదైతే,
చివరికి ఎలా భ్రష్టుడు అవుతాడు అన్నది చాలా
విశదముగా చెప్పాడు గురువు.
7 పతితస్య నాశం వినా -
అలా క్రిందపడినవానికి నాశనముకాకుండా (ఇంకో మార్గము
లేదు);
8 పునర్నారోహ ఈక్ష్యతే - పునః న ఆరోహః ఈక్ష్యతే - ]
పునః ఆరోహః న ఈక్ష్యతే -
మళ్ళీ ఎక్కే మార్గము( బ్రహ్మత్వము) కనపడదు.
అలా క్రిందపడినవానికి నాశనము కాకుండా మళ్ళీ ఎక్కే
మార్గము( బ్రహ్మత్వము) కనపడదు.
దీనికంతకు కారణము ఆ సంకల్పమే - అంటే ఈ అనర్థము అంతా
ఆపడానికి ఆ సంకల్పము తీసుకోకూడదు; ఇంకా చెప్పాలి
అంటే అటువంటి సంకల్పము వదిలెయ్యాలి. అదే గురువు
చెప్పబోయే మాట.
తస్మాత్ సర్వానర్ధస్య కారణమ్ -
అందువల అన్ని అనర్థములకు కారణమైన
సంకల్పం వర్జయేత్ -
సంకల్పమును వదిలివేయవలెను
సంకల్పమే అనర్థాలకి కారణము. అందుకని అటువంటి సంకల్పము
వదిలెయ్యాలి.
దీనికి ఉదాహరణ:
అవథ్యాని హి వస్తూని -
అనారోగ్యకరమైన వస్తువులను
వ్యాధిగ్రస్తో యథోత్సృజేత్ -
యథా వ్యాధిగ్రస్తో ఉత్సృజేత్ -
ఏవిధముగా వ్యాధి కలవాడు వదిలేయునో
అంటే ఏవిధముగా వ్యాధి కలవాడు అనారోగ్యకరమైన వస్తువులను
వదిలేయునో - ఆవిధముగా అనర్థాలకు కారణమగు ఈ
సంకల్పమును వదిలెయ్యాలి:
327/328వ శ్లోక తాత్పర్యము:
మనస్సు విషయములందు ఆసక్తితో, ఆ గుణముల మీద సంకల్పము
చేయును. ఆ దృఢమైన సంకల్పముతో కోరికి పుట్టును. ఆ
కోరికతో మనుష్యుడు సంకల్పము సాధించు క్రియలలో
ప్రవర్తించును; ఆ క్రియలలో ప్రవర్తించు మానవుడు , తన
స్వ స్వరూపము వదిలివేయును. స్వరూపమును వదిలి
భ్రష్టుడై క్రిందకి పడును: అలా క్రిందపడిన వానికి
నాశనము కాకుండా మళ్ళీ పైకి పోయే
మార్గము లేదు. అందువలన ఏ విధముగా వ్యాధి కలవాడు
అనారోగ్యకరమైన వస్తువులను వదిలేయునో - ఆ విధముగా
మానవుడు అనర్థాలకు కారణమగు సంకల్పమును వదిలెయ్యాలి:
అంటే ఈ రెండు శ్లోకాలలో గురువు విషయాలలోఆసక్తితో
మొదలైనది సంకల్పము ద్వారా విజృంభిస్తుంది, కనుక
సంకల్పమును వదిలి వేయవలెను అనే నిర్ధారణకి వచ్చాము.
శ్లోకము 329
అతః ప్రమాదాన్నపరోఽస్తి మృత్యుః
వివేకినః బ్రహ్మవిదః సమాధౌ।
సమాహితః సిద్ధిం ఉపైతి సమ్యక్
సమాహితాత్మా భవ సావధానః ।
వివేకినః బ్రహ్మవిదః సమాధౌ।
వివేకవంతులైన బ్రహ్మవేత్తకు సమాధి విషయమున;
అతః ప్రమాదాన్నపరోఽస్తి మృత్యుః-
అతః ప్రమాదాత్ అపరో మృత్యుః న అస్తి-
అందువలన ప్రమాదము కన్నా వేరే మృత్యువు లేదు;
అందువలన వివేకవంతులైన బ్రహ్మవేత్తకు సమాధి విషయమున
ప్రమాదము కన్నా వేరే మృత్యువు లేదు
సమాహితః సిద్ధిం ఉపైతి సమ్యక్ -
సమ్యక్ సమాహితః సిద్ధిం ఉపైతి -
బాగుగా బ్రహ్మజ్ఞానము కలవాడు సిద్ధిని పొందును
సమాహితాత్మా భవ సావధానః ।
ఎల్లప్పుడు సావధానముగా బ్రహ్మము మీద నిలపబడిన మనస్సు
కలవాడవు అగుము
329 వ శ్లోక తాత్పర్యము:
వివేకవంతులైన బ్రహ్మవేత్తకు సమాధి విషయమున ప్రమాదము
కన్నా వేరే మృత్యువు లేదు, అందువలన ఎల్లప్పుడు
సావధానముగా బ్రహ్మము మీద నిలపబడిన మనస్సు కలవాడవు
అగుము
ఈ శ్లోకములో - గురువు మతిమరుపు అనే ప్రమాదము కన్నా
వేరే మృత్యువులేదు. అందుకని బ్రహ్మత్వములో సావధానముగా
- ప్రమాదానికి అవకాశము ఏమాత్రము ఇవ్వకుండా - ఏకాగ్రతఓ
వుండుము అని.
_________________________________________________
_______________________________________________