!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 330-332
॥ఓం తత్ సత్॥ వివేక చూడామణి 330-332
శ్లోకములు:
వివేకచూడామణిలో, ముందు పది శ్లోకాలలొ (320-329) గురువు
అప్రమత్తత గురించి మాట్లాడాడు.
మనకి కనపడే దృశ్య ప్రపంచమంతా బ్రహ్మమే అన్నసంగతి
మనస్సులో వుంచుకొని మన ప్రారబ్దకాలము అంతా గడపాలి అని
ముఖ్యమైన ఉపదేశము.
ఆ సంగతి మరచిపోతే వచ్చే అనర్థాలగురించి మనము
సాధారణముగా అనుకునే మాటలలోనేచెపుతాడు
మనము బ్రహ్మము అన్నసంగతి మరిచిపోతే (మతిమరుపుతో) అదే
మృత్యువు ( మన బ్రహ్మత్వానికి) అని ఢంకావాయించి
చెప్పాడు.
ఒక క్షణం మరిచిపోతే , మళ్ళి మన కోరికలు అహంకారము
మొదలైనవన్నీ ఆ క్షణంలో మనలో దూరిపోతాయి. విద్వాంసుడు
కూడా ఇన్ద్రియలాలసుడైతే, ఆ బ్రహ్మత్వము మీద మతి మరుపు,
క్షణం లో వాడిని ముంచేస్తుంది. దానికి ఉదాహరణలు
చెప్పాడు.
ఈ ప్రమాదము నుంచి తప్పించుకోవడానికి , విషయములలో కి
మళ్ళే మనస్సు కి సంకల్పము అనే ధ్యాసరాకూడదు. అన్ని
అనర్థాలకు దారిచూపే ఈ సంకల్పమే కారణము కనుక సంకల్పము
పూర్తిగావిడవాలి అని కూడా చెప్పాడు.చివరిమాటగా
సావధానముగా మనస్సు నిశ్చలము చేసి బ్రహ్మత్వములో
నిలుపుము అని చెప్పాడు
సంస్కృతములో వచ్చే శృతులలో మాటలు, స్మృతులలో మాటలు
కలపకుండా, ఇలా చెప్పినవన్నీ సాధారణ పరిభాషలో చెప్పాడు-
అర్థము చేసుకోవడానికి కష్టము లేకుండా చెప్పినమాటలు
ఇవి.
ఇక ముందు ఈ మతిమరుపు కారణములు సూచిస్తాడు గురువు. ఆ
సూచన అభేధ భావము, భేధ భావము అనే వేదాంతిక పరిభాషలో.
బ్రహ్మము ఒక్కటే అన్నది "అభేధ" భావము. అభేద భావము అంటే
భేదము లేని భావము. అదే అద్వైతము. ఆ "అభేధ" భావము
లోపిస్తే - అంటే పిసరంత "భేధ" భావము వుంటే - మనస్సు
భేధ భావములోకి ప్రపంచ విషయాలలో కి పోతుంది.
మతిమరుపు లాగా, ఇక్కడ భేధ భావము కూడా భయము;
భయంకరము; మృత్యువుకి దారితీస్తుంది అన్నమాటని వేదాలలో
వున్న మాటలతో కలిపి చెపుతాడు గురువు. ఇవి ముందు
శ్లోకాలలో వచ్చేమాట.
శ్లోకము 330
జీవతో యస్య కైవల్యం
విదేహేచ స కేవలః।
యత్ కించిత్ పశ్యతో భేధమ్
భయం బౄతే యజుః శ్రుతిః॥330॥
జీవతో యస్య కైవల్యం -
జీవించియుండగా ఎవడు కైవల్యము పొందునో;
విదేహేచ స కేవలః-
అట్టివాడు మరణము తరువాత గూడా కైవల్యముకలవాడే
జీవించియుండగా ఎవడు కైవల్యము పొందునో అట్టివాడు మరణము
తరువాత గూడా కైవల్యముకలవాడే. కైవల్యముపొందినవాడు
ప్రపంచములో సమస్తజీవులలో బ్రహ్మమునే చూచును.
బ్రహ్మత్వములో మతి మరుపు మృత్యువు తో సమానము అని
విన్నాము. మృత్యువు తో సమానము అంటే బ్రహ్మత్వము
కోలుపోతాడు అని. బ్రహ్మత్వములో మతిమరుపు ఎలావస్తుంది
అంటే , సమస్తములో బ్రహ్మము చూడకుండా ఇంకోటి చూడడమే ఆ
మతిమరుపు. వేదాంత పరిభాషలో ఆ ఇంకోటి చూడడమే అంటే
భేదభావము కలిగియుండుట. ఆ భేదభావము గురించి గురువు
చెపుతాడు ముందు పాదములో.
యత్ కించిత్ పశ్యతో భేధమ్-
కొంచెము భేదభావము చూచు వానికి
భయం బౄతే యజుః శ్రుతిః-
యజుర్వేదము భయము కలిగును అని చెప్పుచున్నది:
కొంచెము భేదభావము చూచు వానికి యజుర్వేదము భయము కలిగును
అని చెప్పుచున్నది: అంటే భేదభావము కలవానికి ముక్తి
వుండదు అని. అంటే గురువు ఇప్పటిదాకా చెప్పినమాట,
వేదములు కూడా ప్రమాణముగా చెపుచున్నాడు అన్నమాట.
సమస్తములో బ్రహ్మము చూచువానికి, అంతా ఒక్కటె
కనిపించును. అంతా ఒక్కటె అయినప్పుడు భయము అన్నమాట
వుండదు. కాని భేద భావముతో అంతా ఒక్కటే కాక, ఇంకోటి ఎదో
వున్నది, అంటే ఆ రెండవది ఏదో వున్నది ఒక మాట.
రెండవ దాని వలన భయము కలుగుట సామాన్య న్యాయము. ఆ
భయము తో ఏకత్వము పోయి, బ్రహ్మత్వము పోతుంది. అంటే
భేదభావము కూడా మతిమరుపు లాగా వినాశకారణము. ఇక్కడ
దానికి ప్రమాణము యజుర్వేదము అని గురువు
చెప్పుచున్నమాట.
తాత్పర్యము:
"జీవించియుండగా ఎవడు కైవల్యము పొందునో అట్టివాడు మరణము
తరువాత గూడా కైవల్యముకలవాడే. కొంచెము భేదభావము చూచు
వానికి యజుర్వేదము భయము కలిగును అని చెప్పుచున్నది".
శ్లోకము 331
యదా కదావాపి విపశ్చిదేషా
బ్రహ్మణ్యనన్తే పి అణుమాత్రభేదమ్।
పశ్యత్యదథాముష్య భయం తదేవ
యత్ వీక్షితం భిన్నతయా ప్రమాదాత్॥331॥
యదా కదావాపి విపశ్చిదేషా -
ఎప్పుడైనా వివేకి యగు బ్రహ్మవేత్త
బ్రహ్మణ్యనన్తేపి అణుమాత్రభేదమ్-
అనన్త బ్రహ్మణి అపి అణుమాత్రభేదమ్-
అనన్తమైన బ్రహ్మములో అణుమాత్రమైన భేదమును
ఎప్పుడైనా వివేకి యగు బ్రహ్మవేత్త అనన్తమైన బ్రహ్మములో
అణుమాత్రమైన భేదమును - చూస్తే ఏమిటవుతుంది?
ముందుశ్లోకములలో అది ఇంకోరూపములో విన్న మాట,
విద్వాంసుడు కూడా మతిమరుపుతో నాశనమౌతాడు అని. ఇక్కడ
అదే మాట భేద అభేదముల రూపములో వస్తోంది.
పశ్యత్యదథాముష్య భయం తదేవ-
పశ్యతి యథా ఆముష్య భయం తథైవ -
చూచినచో ఆదే అ ( బ్రహ్మవేత్తకి) భయము
అంటే ఎప్పుడైనా వివేకి యగు బ్రహ్మవేత్త అనన్తమైన
బ్రహ్మములో అణుమాత్రమైన భేదమును - చూస్తే - అదే భయము
కలిగించును - ఎందువలన?
యత్ వీక్షితం భిన్నతయా ప్రమాదాత్ -
ఆ చూచినదానిలో ఏమరుపాటువలన కలిగిన భిన్నత్వముతో
వివేకి యగు బ్రహ్మవేత్త అనన్తమైన బ్రహ్మములో
అణుమాత్రమైన భేదమును - చూస్తే- ఆ ఏమరుపాటువలన
కలిగిన భిన్నత్వముతో - బ్రహ్మము ఇకటి కాదు అది
రెండు అన్నభావముతో - ఆ భయము - తద్వారా బ్రహ్మత్వ
నాశనము కలుగును.
ఇది కూడా మళ్ళీ వేదములలో శృతులలో వచ్చిన మాట -
"ద్వితీయాత్ వై భయం భవతి" ఆ రెందవదానితో భయము కలుగును
అని.
ఇక్కడ చెప్పినమాట- బ్రహ్మత్యైకత్వ భావన కల పండితుడు, ,
తన నిజ తత్త్వము మరచిపోవుటవలన, అనంతమైన బ్రహ్మములో ఏ
కొద్దిగానైనా భిన్నత్వము చూచినచో, ఆ ప్రమాదమువలన
( తన నిజస్వరూపము మరచిపోవుటవలన) కనిపించిన భిన్నత్వమే
భయమునకు కారణము అగును.
తాత్పర్యము:
ఎప్పుడైనా వివేకి యగు బ్రహ్మవేత్త అనన్తమైన బ్రహ్మములో
అణుమాత్రమైన భేదమును చూస్తే
ఆ చూచినదానిలో ఏమరుపాటువలన కలిగిన భిన్నత్వముతో
ఆ బ్రహ్మవేత్తకి భయము కలుగును.
శ్లోకము 332
శ్రుతిస్మృతిర్న్యాయశతై నిషిద్ధే
దృశ్యేఽత్రయః స్వాత్మ మతిం కరోతి
ఉపైతి దుఃఖోపరి దుఃఖజాతం
నిషిద్ధకర్తా స మలిమ్లుచో యథా॥332॥
శ్రుతిస్మృతిర్న్యాయశతై నిషిద్ధే -
శృతి స్మృతుల న్యాయము చేత నిషేధించబడిన -
వందలకొలదీ శృతి స్మృతుల న్యాయము - అంటే శృతి
స్మృతుఅలలో చెప్పబడినమాటలు అని. ఏమిటామాటలు ?
'నేత్ నేతి' ఇది బ్రహ్మము కాదు ఇది బ్రహ్మము కాదు అంటూ
బ్రహ్మము గురించి చెప్పినమాటలు, బ్రహ్మము అనాది అని,
అది సత్ అని గాని అసత్ అని గాని చెప్పబడదు అని
అనేకవిధములగా, బ్రహ్మము ఏది కాదీ వర్ణిస్తూ చెప్పబడిన
మాటలు అన్నమాట.
ఆ మాటలో నిషేధింపబడినది అనాత్మ, అజ్ఞానము.
దృశ్యేఽత్రయః స్వాత్మ మతిం కరోతి-
అత్ర దృశ్యే యః స్వ ఆత్మ మతిం కరోతి -
ఎవడు దేహాదులయందు ఆత్మను తన బుద్ధినితో తలచునో (అట్టి)
వాడు
ఉపైతి దుఃఖోపరి దుఃఖజాతం -
ఒక దుఃఖముపై మరొక దుఃఖమును పొందును
నిషిద్ధకర్తా స మలిమ్లుచో యథా -
ఆ పాపాత్ముడు మలినమైన అంతఃకరణవాడివలె ( అనేక దుఃఖములను
పొందును)
తాత్పర్యము: శృతి స్మృతుల న్యాయము చేత
నిషేధించబడిన దేహాదులయందు ఎవడు ఆత్మను చూచుచు
న్నాడొ వాడు మలినమైన అంతఃకరణవాడివలె ఒక దుఃఖముపై
మరొక దుఃఖమును పొందును
॥ఓం తత్ సత్॥
_______________________________________________