!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 336-339
॥ఓం తత్ సత్॥వివేక చూడామణి 336-339 శ్లోకములు
గురువు మళ్ళీ ముక్తికి మార్గము చెప్పుచున్నాడు 336వ
శ్లోకములో.
శ్లోకము 336
బాహ్యే నిరుద్దే మనసః ప్రసన్నతా
మనః ప్రసాదే పరమాత్మ దర్శనమ్।
తస్మిన్ సుదృష్టే భవబంధనాశో
బహిర్నిరోధః పదవీ విముక్తే॥336॥
1 బాహ్యే నిరుద్దే మనసః ప్రసన్నతా -
బాహ్యవిషయములను నిరోధించుటవలన మనస్సు ప్రశాంతమగును;
2 మనః ప్రసాదే పరమాత్మ దర్శనమ్ -
మనస్సు ప్రశాంతమవగానే పరమాత్మ దర్శనమగును;
బాహ్యవిషయములను నిరోధించుటవలన, వాటిలో ఆసక్తి
విడుచుటవలన , మనస్సు ప్రశాంతమగును; మనస్సు
ప్రశాంతమవగానే అధ్యాత్మిక ఆలోచనలకి అవకాశము
వస్తుంది. అ అధ్యాత్మిక ఆలోచనలలో మనకి అవగాహన
అయ్యేది మన ఆత్మ గురించి. మన ఆత్మ స్వరూపము, మన దేహము
కాదు. ఆత్మస్వరూపము ఆనందమయము. మనలో కోప తాపాలను
రేకెత్తించే అహము మన నిజస్వరూపము కాదు. కోప తాపాల
ఉచ్చస్థాయిలో, మనము ఈ నిజాన్ని గుర్తించి, మనస్సుని
వెనకకి తిప్పుకోవాలి, అది మళ్ళీ బాహ్య విషయముల మీద
ఆలోచన నిరొధించడము తో ప్రారంభము అవుతుంది.
ఆత్మస్వరూపము ఆనందమయము అన్నదే అధ్యాత్మిక తత్త్వము.
అదే పరమాత్మ దర్శనము;
బాహ్యవిషయములను నిరోధించుటవలన మనస్సు ప్రశాంతమగును
అన్న మాటకి నిదర్శనము మన నిద్ర. గాఢ నిద్రలోంచి
లేచినప్పుడు మనస్సు ప్రశాంతముగా వుంటుంది. ఆ నిద్రలో
వున్నప్పుడు, మనస్సులోకి బాహ్యప్రపంచము ప్రవేశించదు
కనుక. అలాగే మనము మెలుకువగా వున్నప్పుడు కూడా, బాహ్య
విషయాలను ఆపితే మనస్సు ప్రశాంతత పొందుతుంది
3 తస్మిన్ సుదృష్టే భవబంధనాశో-
ఆ పరమాత్మయందే భావన స్థిరముగా వున్నప్పుడు భవబంధములు
నాశనమగును;
అంటే బాహ్యవిషయములను నిరోధించుటవలన కలిగిన
ప్రశాంతమనస్సుతో, ఆత్మ యొక్క నిజస్వరూపము గ్రహించడము
అవుతుంది. ఆ నిజ స్వరూపము ద్వారా మనకి తెలిసేది మనకి
ఉన్న బంధములన్నీ మనము కల్పించుకున్నవే గాని అవి నిజము,
నిత్యము కావు అని. అవి నిత్యము కాదు అని
గ్రహించి, మన మనస్సుని స్థిరముగా పరమాత్మలో వుంచడమే,
భవబంధముల నాశనము అన్నమాట. అదే మన ముక్తి.
అందువలన బాహ్యవిషయములు నిరోధించడము ముక్తికి ప్రథమ
సోపానము. అదే వింటాము ఆఖరి పాదములో.
4 బహిర్నిరోధః పదవీ విముక్తే -
బాహ్యవిషముల నిరోధమే ముక్తికి మార్గము:
336 వ శ్లోక తాత్పర్యము:
బాహ్యవిషయములను నిరోధించుటవలన, వాటిలో ఆసక్తి
విడుచుటవలన , మనస్సు ప్రశాంతమగును;మనస్సు
ప్రశాంతమవగానే అధ్యాత్మిక తత్త్వము అవగాహన అగును. అదే
పరమాత్మ దర్శనము. ఆ పరమాత్మయందే భావన స్థిరముగా
వున్నప్పుడు, భవబంధములు నాశనమగును; అందువలన
బాహ్యవిషముల నిరోధమే ముక్తికి మార్గము
బాహ్యవిషయములను నిరోధించుట అంటే తమ ధర్మములను
వదిలెయ్యడము కాదు. మన నిత్య నైమిత్తక కార్యములు
చేయ తగినవి, చేయవలసినవి కూడా. కాని ఏమి చేస్తున్నా
మనస్సుని భగవంతుని ధ్యాసలో వుండాలి గాని, కళ్ళకి కనపడే
చెవులకు వినపడే విషయలధోరణిలో పరిగెత్తకూడదు అని భావము.
మనస్సు ని ఆపగలగడమే ముక్తికి ప్రథమ సోపానము.
శ్లోకము 337
కః పండితః సన్ సదసద్వివేకీ
శ్రుతి ప్రమాణః పరమార్థ దర్శీ।
జానన్హి కుర్యాత్ అసతోఽవలంబం
స్వపాత హేతోః శిశువన్ ముముక్షుః॥337॥
1 కః పండితః సన్ సదసద్వివేకీ-
ఏ పండితుడు, సత్ అసత్ ల విచక్షణాజ్ఞానము కలిగిన
2 శ్రుతి ప్రమాణః పరమార్థ దర్శీ-
శ్రుతుల ప్రమాణము గ్రహించిన, పరమార్థ తత్త్వమును
తెలిసికొనిన;
ముముక్షుః - మోక్షము కోరువాడు;
ఇక్కడ గురువు ముముక్షువు గురించి చెపుతున్నాడు. ఆ
ముముక్షువు (1)సత్ అసత్ ల విచక్షణాజ్ఞానము
కలిగినవాడు(2) శ్రుతుల ప్రమాణము గ్రహించినవాడు (3)
పరమార్థము తత్వమును తెలిసికొనినవాడు.
అలా ఆన్ని తెలిసినవాడు, సత్ అసత్ ల విచక్షణాజ్ఞానము
వున్నవాడు కనక్, అసత్ అన్నది అజ్ఞానము అని
గ్రహించి, అసత్ ని ఎప్పుడూ అధారముగా తీసుకోడు. ఒకవేళ
అసత్ ను అధారముగా తీసుకుంటే బాహ్యప్రపంచములో పడి (
ముందు శ్లోకములో చెప్పినట్టు) నాశనమే
అవుతాడు.
3 జానన్హి కుర్యాత్ అసతో అవలంబం
తెలిసియుండి కూడా అసత్ అయినదాని ఆశ్రయమును
కోరుకుంటాడా? ;
ఏ పండితుడు, సత్ అసత్ ల విచక్షణాజ్ఞానము కలిగిన,
శ్రుతులప్రామాణము గ్రహించిన పరమార్థమును తెలిసికొనిన
ముముక్షువు , అన్నీ తెలిసియుండి కూడా అసత్ అయినదాని
ఆశ్రయమును కోరుకుంటాడు ?
అసత్ అయినదాని ఆశ్రయము పతనానికి దారి తీస్తుంది
కాబట్టి అది చేయకూడని పని. అదే మాట వింటాము
ఆఖరిపాదములో
4 స్వపాత హేతోః శిశువన్ -
శిశువు లాగా తన యొక్క పతనమునకు కారణమగు;
అసత్ అయినదాని ఆశ్రయము పతనానికి దారి తీస్తుంది. అలాగ
పతనమునకు కారణమగు అశ్రయమును, ఏమీ తెలియని శిశువు లాగా
ఎవరు కోరుతాడు? అంటే ఎవరూ కోరరు అని ఇక్కడ భావము.
337 వ శ్లోక తాత్పర్యము :
సత్ అసత్ ల విచక్షణాజ్ఞానము కలిగిన, శ్రుతులప్రామాణము
గ్రహించిన పరమార్థమును తెలిసికొనిన, మోక్షముకోరి
మోక్షము చేరు మార్గములో వున్న (ముముక్షువు) ఏ
పండితుడు, అన్నీ తెలిసి యుండి కూడా, ( ఏమీతెలియని)
శిశువులాగా , తన పతనమునకు కారణమగు అసత్ అయినదాని
ఆశ్రయమును కోరును?
ఇది అలంకారిక భాషలో ( Rhetorical) చెపుతున్నమాట. ఇక్కడ
గురువు ముముక్షువు యొక్క అన్ని గుణములు చెప్పి, అలా
అన్నీ తెలిసిన ముముక్షువు నాశనము కలిగించు
అజ్ఞానమార్గములో వెళ్ళడు అని అసలు భావము.
ఇదే మాట ఇంకొంచెము మనస్సులో గట్టిగా నొక్కడానికి,
గురువు పరస్పర విరుద్ధ విషయాలగురించి చెపుతాడు 338వ
శ్లోకములో
శ్లోకము 338
దేహాది సంసక్తిమతో న ముక్తిః
ముక్తస్య దేహాత్ అభిమత్యభావః।
సుప్తస్య నో జాగరణం న జాగ్రతః
స్వప్నః తయోః భిన్న గుణాశ్రయత్వాత్॥338॥
1 దేహాది సంసక్తిమతో న ముక్తిః -
దేహాదులమీద ఆసక్తి వున్నవాడికి ముక్తి లభించదు;
దేహాదులమీద ఆసక్తిగలవాడు విషయప్రపంచములో మునిగి
తేరుతూ వుంటాడు. అట్టి వాడికి ముక్తి అన్నకోరిక,
అలోచనా వుండనే వుండదు.
2 ముక్తస్య దేహాత్ అభిమత్యభావః -
ముక్తి పొందినవానికి దేహాదులయందు అభిమానము
వుండదు.
ఎలాగ దేహాదులయందు ఆసక్తి కలవానికి ముక్తి అనే విషయము
మీద కోరిక కూడా వుండదో, అలాగే ముక్తి పొందినవానికి
దేహాదులయందు అభిమానము వుండదు. ఇవి రెండు, అంటే
దేహాభిమానము ముక్తి, పరస్పర విరుద్ధమైన విషయములు.
ఈ పరస్పరవిరుద్ధమైన వాటికి ఉదాహరణ నిద్రపోతున్నవాడు,
జాగరణ చేస్తున్నవాడు.
3(i) సుప్తస్య నో జాగరణం -
నిద్రలో వున్నవానికి జాగరణము వుండదు
3(ii) న జాగ్రతః స్వప్నః -
జాగరణము చేస్తున్నవానికి స్వప్నము వుండదు
అంటే నిద్రలో వున్నవానికి జాగరణ వుండదు. జాగరణ
చేస్తున్నవానికి స్వప్నము వుండదు. ఈ రెండు భిన్నమైన
శరీర అవస్థలు కాబట్టి.
4 తయోః భిన్న గుణాశ్రయత్వాత్ -
ఆ రెండు వేరు వేరు ( భిన్నమైన) గుణములను ఆశ్రయించడము
వలన.
338 వ శ్లోక తాత్పర్యము:
దేహాదులమీద ఆసక్తి వున్నవాడికి ముక్తి లభించదు. ముక్తి
పొందినవానికి దేహాదులయందు అభిమానము వుండదు. వేరు
వేరు ( భిన్నమైన) గుణములను ఆశ్రయించడము వలన, నిద్రలో
వున్నవానికి జాగరణ వుండదు జాగరణ చేస్తున్నవానికి
స్వప్నము వుండదు.
అసలు మాట. ముక్తి కావాలి అంటే విషయధోరణిలో
బాహ్యప్రపంచములోకి వెళ్ళకు అని.
శ్లోకము 339
అంతర్భహిః స్వం స్థిరజంగమేషు
జ్ఞానాత్మనాధారతయా విలోక్య।
త్యక్తాఖిలోపాధిః అఖండరూపః
పూర్ణాత్మనా యః స్థిత ఏవ ముక్తః॥339॥
1 అంతర్భహిః స్వం స్థిరజంగమేషు -
స్థిర జంగములలో అంతరముగను బాహ్యముగను ;
స్థిర జంగములలో అంటే చరాచరవస్తువులలో లోపల వెలుపల అని.
2 జ్ఞానాత్మనాధారతయా స్వం విలోక్య-
జ్ఞానరూపము అధారముగా తన ఆత్మను చూడగలిగి
ఇక్కడ గురువు ఆత్మజ్ఞానము తెలిసినవాడిగురించి
చెపుతున్నాడు. అట్టివాడు చరాచరవస్తువులలో లోపల వెలుపల
అంతటా ఆత్మనే (బ్రహ్మమునే) చూస్తాడు.
దౄశ్యరూపములో కనపడేవి అన్ని బ్రహ్మ స్వరూపములే అని
తెలిసినవాడు
3 త్యక్తాఖిలోపాధిః అఖండరూపః -
త్యక్తా అఖిల ఉపాధిభిః అఖండరూపః -
విడువబడిన అన్ని ఉపాధులు కలవాడై, అఖండరూపముతో;
విడువబడిన ఉపాధులు కలవాడు అంటే, అజ్ఞానము దేహాభిమానము
వదిలివేసినవాడు అన్నమాట. ఆంతటా బ్రహ్మము చూడగలిగినవాడు
అజ్ఞానము దేహాభిమానము వదిలివేసినవాడు కూడా. జగత్తులో
వివిధరూపాలలో కనపడే వాటిలో ఒకటే చూడడమే అఖండ రూపము.
అఖండ అంటే ఖండించబడని ఒకే రూపము అని.అఖందము అంటే
బ్రహ్మాందము అని కూడా.
ముందు మూడు పాదాలలో ఆత్మ జ్ఞానము పొందినవాడి లక్షణములు
గురించి గురువు చెప్పాడు.
4 పూర్ణాత్మనా యః స్థిత ఏవ -
పరిపూర్ణ ఆత్మానుభవములో ఎవడు ఉండునో వాడే;
(స) ఏవ ముక్తః - వాడే ముక్తిపొందినవాడు.
అంటే అలా చెప్పబడిన లక్షణాలతో , ఎవరైతే పరిపూర్ణ
ఆత్మానుభవములో ఉండునో వాడే ముక్తుడు;
తాత్పర్యము:
చరాచరవస్తువులలో లోపల వెలుపల, జ్ఞానరూపము అధారముగా తన
ఆత్మను చూడగలిగి, విడువబడిన ఉపాధులు (అజ్ఞానము మున్నగు
నవి) కలవాడై, అఖండరూపముతొ పరిపూర్ణ
ఆత్మానుభవములో ఎవడు ఉండునో వాడే ముక్తిపొందినవాడు.
ఇక్కడ ముఖ్యమైన మాట. బ్రహ్మత్వము అంటే ఏమిటి అనే
జ్ఞానము. ఆ జ్ఞానము తో తానేఆనుభవ పూర్వకముగా బ్రహ్మము
అవడము. బ్రహ్మజ్ఞానము వున్నా , ఆ బ్రహ్మజ్ఞానముతో
సమస్త చరాచరులలో స్థిరముగా బ్రహ్మము చూడగలిగినప్పుడే
బ్రహ్మత్వము పొందినవాడు అనబడును. ఇది అసలుమాట.
ఇది 339 వ శ్లోకము ముక్తిపొందినవాని గురించి, గురువు
చెప్పిన మాట.
॥ఓం తత్ సత్॥
____________________________________________________
______________________________________________________