!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 340-342
॥ఓం తత్ సత్॥వివేక చూడామణి 340-342 శ్లోకములు
సర్వాత్మభావము ఎందుకు ఎలా సంపాదించాలి అన్నమాట మీద
మూడు శ్లోకాలలో గురువు విశదీకరిస్తాడు. సర్వాత్మభావము
అంటే తనలో వున్న ఆత్మ ఇతర ప్రాణులలో వున్న ఆత్మ ఒక్కటే
అని గ్రహించడము.అది చాలా సుందరమైన భావము.
సర్వాత్మభావమే బంధవిమోచనాలకి కారణము అందుకని దానిని
మించిన భావము ఇంకోటి లేదు అని చెప్పవచ్చు. అది
ఎలాసంభవిస్తుంది అంటే ఆత్మ నిష్టతో. అలా ఆత్మనిష్ఠలో
వున్న వాళ్ళ చూసేది అంతా బ్రహ్మమే. ఆలా
చూడగలిగినప్పుడు బంధముల ప్రసక్తి లేదు. ఇది సులభముగా
అర్థము అయ్యే మాట. ఈ మాటని బలపరచడానికి , ఇదే మాట
శ్రుతులలో కూడా చెప్పబడినది అని గురువు మూడో శ్లోకములో
చెపుతాడు.
శ్లోకము 340
సర్వాత్మనా బన్ధవిముక్తి హేతుః
సర్వాత్మభావాన్ న పరోఽస్తి కశ్చిత్ ।
దృశ్యాగ్రహే సత్ ఉపపద్యతేఽసౌ
సర్వాత్మ భావోఽస్య సదాత్మ నిష్ఠయా॥
1 సర్వాత్మనా బన్ధవిముక్తి హేతుః-
సర్వాత్మభావము బంధవిముక్తికి కారణము
సర్వత్రవ్యాపించి యున్న చరాచర ప్రాణులలో బ్రహ్మము
చూడగలగడమే బంధముల నుంచి విముక్తి. బంధవిముక్తి కావాలి
అంటే సమస్త జగత్తులో బ్రహ్మము చూడగలిగి వుండాలి.
ఇంతకన్నా ఇంకో మంచిమార్గము లేదు. సర్వాత్మభావము
అనడములో సమస్తములో బ్రహ్మమును చూడగలగాలి అని. అంటే
తనలో వుండే ఆత్మ ఇతరులలో వుండే ఆత్మ ఒకటే అని అదే
బ్రహ్మము అని గ్రహించడమే సర్వాత్మ భావము
2 సర్వాత్మభావాన్ న పరోఽస్తి కశ్చిత్ -
సర్వాత్మభావము కన్నా మించినది ఇంకోటి లేదు;
సర్వాత్మభావము బంధవిముక్తికి కారణము, సర్వాత్మభావము
కన్నా మించినది ఇంకోటి లేదు
మరి సర్వాత్మభావము ఎలా కలుగుతుంది?
3 దృశ్యాగ్రహే సతి ఉపపద్యతేఽసౌ
దృశ్యప్రపంచము తొలగిపోయినప్పుడు అది లభించును.
దృశ్యప్రపంచము తొలగిపోయినప్పుడు సర్వాత్మభావము
లభిస్తుంది. అది ఎలాగ అంటే దృశ్యప్రపంచములో వున్న
విషయములను వదలివేస్తే ఆ విషయముల బంధము పొతుంది.
ఉదాహరణకి, మనము దినపత్రిక చదువుతాము. ఆ దినపత్రిక
చదవడము వదిలేస్తే ఆ దినపత్రిక కావాలి అనే బంధము
పోతుంది. అలాగే అన్ని విషయాలు ఒకదాని తర్వాత
ఒకటి చొప్పున అన్నీ వదిలేస్తే అన్ని బంధాలు పోతాయి.
అన్ని బంధాలు పోతే మిగిలినది సర్వాత్మభావమే. ఇది
పంచకోశాలలో అది అత్మకాదు అని వదిలేసి నట్ట్లు,
బందఝాలని కూడా ఇవి నావి కావు అనుకొని వదిలెయ్యాలి
అన్నమాట
మరి సర్వాత్మ భావము రావడానికి దృశ్యప్రపంచము ఎలా
వదలగలుగుతాము?
4 సర్వాత్మ భావోఽస్య సదాత్మ నిష్ఠయా
ఆత్మనిష్టచేత అతని సర్వాత్మభావము;
ఎల్లప్పుడు ఆత్మనిష్టలో వుండగలిగితే దృశ్య ప్రపంచము
తొలగిపోతుంది దానితో పాటు అన్ని బంధములు తొలగి పోతాయి.
340 వ శ్లోకతాత్పర్యము:
సర్వాత్మభావము బంధవిముక్తికి కారణము. సర్వాత్మభావము
కన్నా మించినది ఇంకోటి లేదు. ఆత్మనిష్టచేత
దృశ్యప్రపంచము తొలగిపోయినప్పుడు అతని సర్వాత్మభావము
లభించును.
ఆత్మనిష్ఠతోనే సర్వాత్మభావము లభిస్తుంది అన్నమాట. అదే
మాట శ్రుతులలో కూడా చెప్పారు అని గురువు మళ్ళీ ముందు
శ్లోకాలో చెపుతాడు
ఇదే మాట మళ్ళీ మన దేహమే ముఖ్యము అన్నవారికి సర్వాత్మ
భవము లభించదు అంటూ,
శ్లోకము 341
దృశ్యస్యాగ్రహణం కథం ను ఘటతే దేహాత్మనా తిష్ఠతః
బాహ్యార్థానుభవప్రసక్త మనసః తత్తత్క్రియాం కుర్వతః।
సంన్యస్థాఖిలధర్మకర్మవిషయైః నిత్యాత్మ నిష్ఠాపరైః
తత్వజ్ఞైః కరణీయమాత్మని సదానన్దేచ్ఛుభిః యత్నతః॥
1 దృశ్యస్యాగ్రహణం కథం ను ఘటతే దేహాత్మనా తిష్ఠతః;
దేహాత్మనా తిష్ఠతః - దేహమే పదిలము అదే ఆత్మ
నుకునే వాడికి
దృశ్యస్యాగ్రహణం కథం ను ఘటతే - దృశ్యప్రపంచము
నుంచి విడుదల ఎలా లభిస్తుంది?
ముందు శ్లోకములో దృశ్యప్రపంచము నుంచి విడుదలతో
బంధనవిముక్తి అని అనుకున్నాము. కాని దేహమే ఆత్మ
అనుకునేవాడు దృశ్యప్రపంచములో మునిగి తేలేవాడు. అటువంటి
వాడికి దృశ్యప్రపంచము నుంచి విడుదల లభించదు. గురువు
ప్రశ్నపూర్వకముగా అదే మాట చెప్పుచున్నాడు. దేహమే ఆత్మ
నుకునే వాడికి - దృశ్యప్రపంచము నుంచి విడుదల ఎలా
లభిస్తుంది?
2 బాహ్యార్థానుభవప్రసక్త మనసః తత్తత్క్రియాం కుర్వతః।
బాహ్యార్థానుభవప్రసక్త మనసః -
బాహ్యవిషయములపై ఆసక్తి కలమనస్సు కలవాడు
తత్తత్క్రియాం కుర్వతః -
విషయములను సంపాదించుటకు కావలచసిన పనులు
చేయువాడికి-
బాహ్యవిషయములపై ఆసక్తి కలమనస్సు కలవాడు, అట్టి
విషయములను సంపాదించుటకు కావలసిన పనులు
చేయువాడికి- దృశ్యప్రపంచము నుంచి విడుదల ఎలా
లభిస్తుంది?
దేహమే ఆత్మ నుకునే వాడికి, అంటే బాహ్యవిషయములపై
ఆసక్తి కలమనస్సు కలవాడు, అట్టి విషయములను
సంపాదించుటకు కావలసిన పనులు చేయువాడికి -
దృశ్యప్రపంచము నుంచి విడుదల ఎలా లభిస్తుంది? అట్టి
వాడికి దృశ్యప్రపంచము నుంచి విడుదల లభించదు అని భావము.
మరి ఎవరికి లభిస్తుంది. ముందు శ్లోకములో విన్నది
అత్మనిష్ఠలో వుండే వాడికి లభిస్తుంది అని. అదే కొంచెము
విశదముగా మళ్ళీ వింటాము.
3 సంన్యస్థాఖిలధర్మకర్మవిషయైః నిత్యాత్మ నిష్ఠాపరైః-
సంన్యస్థాఖిలధర్మకర్మవిషయైః - అఖిల ధర్మ కర్మ విషయైః
సంన్యస్థ -
అన్ని ధర్మములను, కర్మలను, విషయములను
సంన్యసించినవాడికి
నిత్యాత్మ నిష్ఠాపరైః - ఎల్లప్పుడు ఆత్మ నిష్ఠలో వుండే
వాడికి
అన్ని ధర్మములను, కర్మలను, విషయములను
సంన్యసించినవాడికి, ఎల్లప్పుడు ఆత్మ నిష్ఠలో వుండే
వాడికి దృశ్యప్రపంచము నుంచి విడుదల లభించును.
4 తత్వజ్ఞైః కరణీయమాత్మని సదానన్దేచ్ఛుభిః యత్నతః -
ఆత్మని సదానన్దేచ్ఛుభిః తత్వజ్ఞైః యత్నతః -
ఆత్మలో ఎల్లప్పుడు ఆనందము కోరుకొను తత్వజ్ఞానుల చేత
వారి ప్రయత్నపూర్వకముగా
కరణీయం - చేయతగినది ( వారికి దృశ్యప్రఫంచమునుంచు
విడుదల లభించును)
తాత్పర్యము :
"దేహమే ఆత్మ నుకునే వాడికి, అంటే బాహ్యవిషయములపై
ఆసక్తి కలమనస్సు కలవాడు, అట్టి విషయములను
సంపాదించుటకు కావలసిన పనులు చేయువాడికి -
దృశ్యప్రపంచము నుంచి విడుదల ఎలా లభిస్తుంది? అన్ని
ధర్మములను, కర్మలను, విషయములను సంన్యసించిన,
ఎల్లప్పుడు ఆత్మ నిష్ఠలో వుండు, ఆత్మలో ఎల్లప్పుడు
ఆనందము కోరుకొను తత్వజ్ఞానులకు ప్రయత్నముతో
దృశ్యప్రపంచము నుంచి విడుదల లభించగలదు."
శ్లోకము 342
సార్వాత్మ్యసిద్ధయే బిక్షోః
కృతశ్రవణకర్మణః ।
సమాధిం విధదాత్యేషా
శాన్తో దాన్త ఇతి శ్రుతః॥
1 కృతశ్రవణకర్మణః కర్మణః -
వేదాన్తవిషయములను వినిన
2 సార్వాత్మ్యసిద్ధయే బిక్షోః -
బిక్షుకి ( సంన్యాసికి) సర్వ ఆత్మత్వము సిద్దించుటకు
వేదాన్తవిషయములను వినిన బిక్షుకి ( సంన్యాసికి) సర్వ
ఆత్మత్వము సిద్దించుటకు ఏమి చేయ్యాలి అన్నమాట
గురువు ఇక్కడ విశదీకరిస్తున్నాడు. ముందు శ్లోకములో
సంన్యాసి ఆత్మనిష్ఠలో మునిగితే లబిస్తుందో అని చెప్పిన
గురువు, ఇక్కడ అదే మాటకి వేదములలో వున్న
ప్రమాణము మనముందు పెడుతున్నాడు.
3 శాన్తో దాన్త ఇతి శ్రుతః -
"శాన్తో దాన్త" అనబడు శ్రుతి;
సమాధిం విధదాత్యేషా -
4 ఏషా సమాధిం విదధాతి -
ఈ సమాధి విధానము నిర్దేశించుచున్నది;
"శాన్తో దాన్త" అనబడు శ్రుతి ఈ సమాధి విధానము
నిర్దేశించుచున్నది.
342 వ శ్లోక తాత్పర్యము:
"వేదాన్తవిషయములను వినిన బిక్షుకి ( సంన్యాసికి) సర్వ
ఆత్మత్వము సిద్దించుటకు "శాన్తో దాన్త" అనబడు శ్రుతి
సమాధి విధానము నిర్దేశించుచున్నది".
ఆత్మనిష్ఠలో వుండే సంన్యాసికి సర్వాత్మ తత్త్వము
లభిస్తుంది అని చెప్పిన గురువు, ఇక్కడ శ్రుతులు కూడా
అదే మాట చెపుతున్నాయి అని ధ్వనిస్తూ , "శాన్తో
దాన్త" అనబడే శ్రుతి ( బృహదారణ్యక ఉపనిషత్తులో) సర్వ
ఆత్మత్వము సిద్దించుటకు సమాధి విధానము సూచిస్తున్నది
అని చెప్పాడు.
ఆ "శాన్తో దాన్త" అనబడే శ్రుతి చెప్పిన మాట చూద్దాము
ఒకసారి.
"తస్మాదేవమ్ విత్ శాన్తో దాన్త ఉపరతః తితిక్షుః,
సమాహితః, శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం
పశ్యేత్" ( బృహదారణ్యక ఉపనిషత్ ); శమ (
Tranquility of mind) దమ ( control of senses)
ఉపరతి (renunciation or withdrawl) తితిక్షు (
forbearance or endurance) శ్రద్ధ (failth)
సమాధాన (one pointed concentration) మున్నగు
(షడ్ సంపత్తి) గుణములతో కూడినవాడై( సమాహితః)
శ్రద్ధవహించి తనలోనే ఆత్మని చూడగలుగుతాడు అని.
అదే ఆత్మనిష్థలో వున్నవాడికి సర్వాత్మ తత్వము
లభిస్తుంది అంటే.
॥ఓం తత్ సత్॥
__________________________________________________
______________________________________________________