!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 357-360
వివేక చూడామణి 357-360 శ్లోకములు:
సర్వాత్మ సిద్ధికొరకు ( అంటే సర్వాత్మత్వము
పొందుటకొరకు) శాంతి దాంతి మొదలగు వాటితో (షడ్
సంపత్తితితో) కూడిన నిర్వికల్ప సమాధి విధానమును శృతులు
నిర్దేశించుచున్నాయి అని( 242 వ శ్లోకములో) గురువు
చెప్పి, ఆ నిర్వికల్ప సమాధిని గురించి, 'శాంతో దాంతః
పరమ ఉపరతః..' అంటూ 356 శ్లోకములో చెప్పాడు. ఆ
నిర్వికల్ప సమాధి ముఖ్యము అన్నమాట మళ్ళీ మళ్ళీ
చెపుతాడు 357 నుంచు 360 శ్లోకము వరకు. ఇక్కడ భవసాగరము
దాటి ముక్తి పొందడానికి ముఖ్యము నిర్వికల్పసమాధి
అని(357), ముక్తి పరోక్ష జ్ఞానము ద్వారా కాదు స్వకీయ
అనుభవజ్ఞానముతొనే అంటే నిర్వికల్ప సమాధిలో వస్తుంది
అని ( 358) , ఆ ధ్యానములో మునిగి వున్నవాడు , కీటకము
ఎలా భ్రమరము అవుతుందో అలాగే యతి సమాధిలో బ్రహ్మత్వము
పొందుతాడు అని ( 359/360) శ్లొకాలలో వింటాము.
శ్లోకము 357:
సమాహితా యే ప్రవిలాప్య బాహ్యమ్
శ్రోత్రాది చేతః స్వమహం చిదాత్మని।
త ఏవ ముక్తా భవపాశ బంధైః
నాఽన్యేతు పారోక్షకథాభిధాయినః॥357॥
శ్లోకవివరణ:
(1&2)యే ప్రవిలాప్య బాహ్యమ్
శ్రోత్రాది చేతః స్వమహం చిదాత్మని;
యే చిదాత్మని - ఎవరు చిదాత్మలో;
బాహ్యమ్ శ్రోత్రాది చేతః స్వమహం -
బాహ్యప్రపంచమును, శ్రోత్రాది ఇంద్రియములను, మనస్సుని;
ప్రవిలాప్య సమాహితా -
విలీనము చేసి నిశ్చలుడైవుండునో ;
అంటే - ఎవరు చిదాత్మలో బాహ్యప్రపంచమును,
శ్రోత్రాది ఇంద్రియములను, మనస్సుని
విలీనము చేసి నిశ్చలుడైవుండునో అని - అట్టివాడి
నిశ్చలత్వము పొందిన వాని గురించి గురువు
ప్రతిపాదిస్తున్నాడు; భజగోవిందములో
"నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః" అని విన్నాము. అంటే
నిశ్చలత్వము సంపాదించి నప్పుడు ముక్తి అని,
అంటే నిశ్చలత్వముతో భవసాగరముయొక్క బంధముల నుంచి
ముక్తి పొందడము అన్నమాట.
అదే మూడవపాదములో వింటాము.
(3) త ఏవ ముక్తా భవపాశ బంధైః-
వాడే భవసాగరముయొక్క బంధముల నుంచి ముక్తి
పొందినవాడు:
ఇది నిశ్సంసయమైన మాట.
భవసాగర బంధములనుంచి విముక్తి పొందడము - పరోక్షముగా
విన్నమాటతో కాదు - వినినతరువాత - తన ప్రయత్నముతో
బాహ్యప్రపంచమును, శ్రోత్రాది ఇంద్రియములను, మనస్సుని
చిదాత్మలో ( పరమేశ్వరునిలో) విలీనము చేసి నిశ్చలత్వము
పొందుతాడో వాడె ముక్తి పొందినవాడు. పరోక్ష జ్ఞానము
చాలదు అని చివరి పాదములో గురువు మళ్ళీ చెపుతాడు;
(4) నాఽన్యేతు పారోక్షకథాభిధాయినః -
అన్యే పరోక్ష కథాభిదాయినః న
తు-
ఇంకొకరివలన తెలుసుకొనినవాడు
ముక్తుడు కాలేడు !
357వ శ్లోకతాత్పర్యము:
ఎవరు చిదాత్మలో బాహ్యప్రపంచమును, శ్రోత్రాది
ఇంద్రియములను, మనస్సుని
విలీనము చేసి నిశ్చలుడైవుండునో - అట్టి వాడే
భవసాగరముయొక్క బంధముల నుంచి ముక్తి పొందినవాడు.
ఇంకొకరివలన తెలుసుకొనినవాడు ముక్తుడు కాలేడు
చిదాత్మలో బాహ్యప్రపంచమును, శ్రోత్రాది ఇంద్రియములను,
మనస్సుని ఎవరు
విలీనము చేసి నిశ్చలుడైవుండగలరో వారికి మాత్రమే
ముక్తి. అని భావము. మళ్ళీ భేధభావము రాకుండా ఆ
నిశ్చలత్వము సదా వుండాలి అని అదే ముక్తి అని ముందు
శ్లోకములో వింటాము.
శ్లోకము 358:
ఉపాధి భేధాత్ స్వయమేవ భిద్యతే
చోపాధ్యపోహే స్వయమేవ కేవలః।
తస్మాదుపాధేః విలయాయ విద్వన్
వసేత్ సదాకల్పసమాధి నిష్ఠయా॥358॥
1 ఉపాధి భేధాత్ స్వయమేవ భిద్యతే-
ఉపాధి భేదముతో స్వయముగా ఖిన్నుడవుతున్నాడు;
భిద్యతే అంటే ఛిన్నభిన్నమౌడము, అదే నాశనమౌడము లేక
భవసాగరములో మునిగిపోవడము; ఉపాధి బేధము అంటే తను
పరమాత్మ వేరే అనే అనే ద్వైత భావము. అద్వైతములో ఉన్నది
ఒక్కటే.
పరమాత్మ ఒక్కడే అని, అద్వితీయుడని, భేదములు లేనివాడని
అని విన్నమాటలే. ఉపాధి భేదము అంటే మాయ. మనకి మాయ వలన
మనము వేరె పరమాత్మ వేరే అన్న్ భావము కలుగుతుంది.
2 ఉపాధ్యపోహే స్వయమేవ కేవలః చ-
ఉపాధి ( భేదముకలిగించే) అపోహలు నిరాకరించబడగానే
కేవలుడు అగుచున్నాడు;
ఉపాధి బేధము లేదు అని నిర్థారించుకున్నప్పుడు భ్రమలు
తొలగి పోయి కేవలుడు, అంటే కేవల జ్ఞానము కలవాడు
అవుతాడు. కేవలజ్ఞానము అనడములో భావము బ్రహ్మత్వము అని.
అంటే ఉపాధిభేధము తొలగించుకోవాలి అన్నమాట.
3 తస్మాదుపాధేః విలయాయ విద్వన్-
విద్వన్ తస్మాద్ ఉపాదేః విలయాయ-
విద్వాంసుడు - అందువలన ఉపాధులను విలీనము చేసి;
4 వసేత్ సదాకల్పసమాధి నిష్ఠయా-
అకల్పసమాధి నిష్ఠయా సదావసేత్ -
నిర్వికల్ప సమాధి నిష్ఠలో వసించవలెను ;
అంటే కేవలుడు (బ్రహ్మ జ్ఞానము కలవాడు) అవడము కోశము
ఉపాధిబేధములను విలీనము చేసి అంటే నాశనము చేసి, సమస్త
జగత్తులో బ్రహ్మమునే చూస్తూ , నిర్వికల్ప సమాధిలో
ఉండాలి. అది తెలిసినవాడు, అంటే విద్వాంసుడు,
ఉపాధులను విలీనము చేసి, బ్రహ్మత్వము కోసము నిర్వికల్ప
సమాధి నిష్ఠలో వసించవలెను అన్నమాట.
358 వ శ్లోక తాత్పర్యము:
ఉపాధి భేదముతో స్వయముగా ఖిన్నుడవుతున్నాడు;
భేదముకలిగించే ఉపాధి అపోహలు నిరాకరించబడగానే
కేవలుడు ( బ్రహ్మము తెలిసినవాడు) అగుచున్నాడు; ఓ
విద్వాంసుడా - అందువలన ఉపాధులను ( బ్రహ్మములో)
విలీనము చేసి నిర్వికల్ప సమాధి నిష్ఠలో వసించవలెను.
చిదాత్మలో బాహ్యప్రపంచమును, శ్రోత్రాది ఇంద్రియములను,
మనస్సుని ఎవరు
విలీనము చేసి నిశ్చలుడైవుండగలరో వారికి మాత్రమే
ముక్తి, అని మొదటి శ్లోకములో చెప్పిన గురువు , ఆ
నిశ్చలత్వము క్షణికము కాకూడదు, ముముక్షువు అదే భావములో
సదా అంటే ఎల్లప్పుడు నివశించాలి అని ఇక్కడి భావము.
శ్లోకము 359
సతి సక్తో నరో యాతి
సద్భావం హ్యేకనిష్ఠయా।
కీటకో భ్రమరం ధ్యాయన్
భమరత్వాయ కల్పతే॥ 259॥
1 సతి సక్తో నరో -
బ్రహ్మము యందు బుద్ధి గల నరుడు;
2 యాతి సద్భావం హ్యేకనిష్ఠయా -
ఏక నిష్ఠయా సద్భావం యాతి -
తదేక నిష్ఠతో సద్భావమును (బ్రహ్మత్వమును)
పొందును
బ్రహ్మము యందు బుద్ధి గల నరుడు తదేక నిష్ఠతో
సద్భావమును (బ్రహ్మత్వమును) పొందును; దానికి ఉదాహరణ:
3 కీటకో భ్రమరం ధ్యాయన్-
కీటకము తుమ్మదెనే ధ్యానము చేయుచు;
4 భ్రమర త్వాయ కల్పతే -
తుమ్మెద అగు చున్నట్లు;
ఏలాగైతే కీటకము తుమ్మెదనే ధ్యానము చేయుచూ తుమెద
అగుచున్నదో - అలాగే బ్రహమము యందు బుద్ధి కల నరుడు తదేక
నిష్ఠతో సద్భావమును (బ్రహ్మత్వమును) పొందును.
359 వ శ్లోక తాత్పర్యము:
బ్రహ్మము యందు ఆసక్తి కలనరుడు తదేక నిష్ఠతో
సద్భావమును (బ్రహ్మత్వమును) పొందును. భ్రమరము కాని
కీటకము , తదేక ధ్యానముతో భ్రమరము అగుచున్నది కదా.
ఇక్కడ చెప్పిన విశేషము - భ్రమరము కన్నా భిన్నమైన
కీటకము భ్రమరము అవుచున్నప్పుడు, బ్రహ్మ స్వరూపమైన
జీవుడు బ్రహ్మము అగును అని వేరే చెప్పనక్కరలేదు.
దానికి మార్గము నిర్వికల్పసమాధి అని గురు ఉపదేశము.
అదే మాట మళ్ళీ 360 వ శ్లోకములో .....
శ్లోకము 360
క్రియాంతరాసక్తి మపాస్య కీచకో
ధ్యాయన్యథాలిమ్ హ్యలీభావమృచ్ఛతి।
తథైవ యోగీ పరమాత్వ తత్త్వం
ధ్యాత్వా సమాయాతి తదేక నిష్ఠయా॥260॥
1 క్రియాంతరాసక్తి మపాస్య కీచకో-
కీచకము తన సమస్త క్రియలందు ఆసక్తిని విడిచిపెట్టి;
2a ధ్యాయన్యథాలిమ్ - యథా ఆలిం ధ్యాయన్ -
ఎలాగ తుమ్మెదను ధ్యానించుచూ;
2b హ్యలీభావమృచ్ఛతి - హి అలీభావం ఋచ్ఛతి -
తుమ్మెద భావమును పొందుచున్నదో;
కీచకము తన సమస్త క్రియలందు ఆసక్తిని
విడిచిపెట్టి ఎలాగ తుమ్మెదను ధ్యానించుచూ, తుమ్మెద
భావమును పొందుచున్నదో - గురువు భ్రమరముయొక్క ఉదాహరణ
మళ్ళీ విశదీకరిస్తున్నాడు - అలాగే యతి కూడా పరమాత్వ
తత్వము గురించి ధ్యానించుచూ పరమాత్మ తత్త్వమును
పొందుచున్నాడు అని గురువు చెపుతాడు:
3 తథైవ యోగీ పరమాత్వ తత్త్వం -
అలాగే యోగి పరమాత్మ తత్త్వమును;
4 ధ్యాత్వా సమాయాతి తదేక నిష్ఠయా -
తదేక దృష్ఠితో ధ్వానించుచు ఆ పరమాత్మ తత్త్వమును
పొందుచున్నాడు:
360 వ శ్లోక తాత్పర్యము:
కీచకము తన సమస్త క్రియలందు ఆసక్తిని విడిచిపెట్టి ఎలాగ
తుమ్మెదను ధ్యానించుచూ, తుమ్మెద భావమును పొందుచున్నదో
, అలాగే యోగి పరమాత్మ తత్త్వమును; తదేక దృష్ఠితో
ధ్వానించుచు ఆ పరమాత్మ తత్త్వమును పొందుచున్నాడు.
బ్రహ్మ స్వరూపమైన జీవుడు, తను బ్రహ్మము కన్న భిన్నము
అని మాయలో పడిన జీవుడు, తానే బ్రహ్మము అనే తదేక
ధ్యానములో కీటకము భ్రమరమైన రీతిలో , జీవుడు కూడా
బ్రహ్మము అగుచున్నాడు.
॥ఓం తత్ సత్॥
_____________________________________________________
__________________________________