!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 377-380
వివేక చూడామణి 377-380 శ్లోకములు:
ముందు శ్లోకములో పురుషుడికి మోక్షము కావాలంటే
వైరాగ్యము వివేకము అనే రెండు రెక్కలు కావాలి అని
చెపుతాడు గురువు. అక్కడే ఇంకో మాట కూడా
విన్నాము; అది "అత్యంత వైరాగ్యవతః సమాధిః" అంటే అత్యంత
వైరాగ్యముతో నిర్వికల్ప సమాధి, తద్ద్వారా మోక్షము అని
కూడా విన్నాము. ఇక్కడ ముందు శ్లోకాలలో గురువు
వైరాగ్యము ఆత్మ జ్ఞానము కలిపితే వచ్చే లాభాలను
వివరించి , ధ్యానము ఎలా చెయ్యాలి
అన్నసంగతి వివరిస్తాడు.
శ్లోకము 377
వైరాగ్యాన్నపరం సుఖస్య జనకం పశ్యామి వశ్యాత్మనః
తచ్చేత్ శుద్ధతరాత్మబోధసహితం స్వారాజ్యసామ్రాజ్యధుక్।
ఏతత్ద్వారం అజస్రముక్తి యువతేః యస్మాత్త్వమస్మాత్పరం
సర్వత్రా స్పృహయా సదాత్మని సదా ప్రజ్ఞాం కురు శ్రేయసే॥
1 వైరాగ్యాన్నపరం సుఖస్య జనకం పశ్యామి వశ్యాత్మనః-
వైరాగ్యాత్ న అపరం సుఖస్య జనకం పశ్యామి
వశ్యాత్మనః -
వశ్యాత్మనః - అన్నీ వశములో
వుంచుకొనేవాడికి
వైరాగ్యాత్ అపరం సుఖస్య జనకం న పశ్యామి -
వైరాగ్యముకన్నా సుఖమును కలిగించేది
చూడను;
అంటే - అన్నీ వశములో వుంచుకొనేవాడికి
కూడా వైరాగ్యముకన్నా సుఖమును కలిగించేది చూడను;
ఇక్కడ గురువు చెపుతున్నది, అన్నీ వశములో
వుంచుకొన్నవాడికి వైరాగ్యముకన్నా సుఖమును కలిగించేది
లేదు అని. మహా తపస్వి అయినా వైరాగ్యము లేకపోతే వచ్చే
సుఖము కన్నా, వైరాగ్యముతో వచ్చే సుఖము మహత్తరమైనది
అన్నమాట.
2 తచ్చేచ్చుద్ధతరాత్మబోధసహితం
స్వారాజ్యసామ్రాజ్యధుక్ -
తత్ శుద్ధతరాత్మబోధసహితం
చేత్ స్వారాజ్యసామ్రాజ్యధుక్ -
తత్ శుద్ధతరాత్మబోధసహితం చేత్ -
అది అతి శుద్ధమైన ఆత్మ బోధముతో
కూడినదైనచో
స్వారాజ్యసామ్రాజ్యధుక్ -
స్వారాజ్యసామ్రాజ్యములను ఇచ్చునది
ఆ వైరాగ్యము అతి శుద్ధమైన ఆత్మ బోధముతో
కూడినదైనచో స్వారాజ్యసామ్రాజ్యములను
ఇచ్చునది.
అంటే అన్నీ వశములో వుంచుకొనేవాడికి వైరాగ్యముకన్నా
సుఖమును కలిగించేది చూడను అని చెప్పి , ఆ వైరాగ్యమే
ఆత్మ జ్ఞానముతో కలిపితే వచ్చే లాభము చెపుతున్నాడు
గురువు; ఆ వైరాగ్యము అతి శుద్ధమైన ఆత్మ బోధముతో
కూడినదైనచో స్వారాజ్య
సామ్రాజ్యములను ఇచ్చునది.
ఇక్కడ స్వారాజ్యము తనకి తనే రాజు ఇతరుల వశములో
లేనివాడు, మనలో అంతర్గతమైన మనో బుధ్యహంకారాలకి కూడా
రాజు అన్నమాట; సామ్రాజ్యము బయట ప్రపంచము తో
కూడినది. అంటే ఆత్మ జ్ఞానముతో కూడిన వైరాగ్యము బయట
ప్రపంచము మీద కూడా అధిపత్యము కలిగిస్తుంది అన్నమాట.
అన్నీ వశములో వుంచుకొనేవాడికి వైరాగ్యముకన్నా సుఖమును
కలిగించేది చూడను అన్నమాట నిజమే అని నమ్మడానికి
పురాణాలు ఇతిహాసాలలో మనకి ఉదాహరణలు వున్నాయి.
ముందు శ్లోకములో అత్యంత వైరాగ్యవతః సమాధిః - అత్యంత
వైరాగ్యముతో సమాధిఅని చెప్పినమాట మళ్ళీ ఇక్కడ
చెప్పడమైనది. అత్యంత వైరాగ్యముతో సమాధి అన్నప్పుడు,
దానికి ఆత్మ జ్ఞానము కలిపితే వచ్చేది మోక్షమే.
3 ఏతత్ద్వారం అజస్రముక్తి యువతేః
యస్మాత్త్వమస్మాత్పరం
ఏతత్ ద్వారమ్ అజస్రముక్తి
యువతేః యస్మాత్
అస్మాత్ పరమ్-
యస్మాత్ ఏతత్ అజస్రముక్తి యువతేః
ద్వారం -
ఏ కారణమువలన శాశ్వతమైన ముక్తి అనెడి
యువతి పొందుటకై ద్వారమో;
అస్మాత్ - అందువలన
(అన్నీ వశములో వున్నవాడికి) వైరాగ్యమే ముక్తి కి
ద్వారము అని చెపుతున్నాడు గురువు.
4 సర్వత్రాస్పృహయా సదాత్మని
సదా ప్రజ్ఞాం కురు శ్రేయసే।
సర్వత్ర అస్పృహయా శ్రేయసే -
ఆంతటనూ ఆసక్తిలేకుండా శ్రేయస్సుకొరకై;
సదాత్మని సదా ప్రజ్ఞాం కురు -
ఎల్లప్పుడును అధికముగా సదాత్మయందు
ధ్యానము చేయుము;
ఏ కారణమువలన శాశ్వతమైన ముక్తి అనెడి
యువతి పొందుటకై (ఆ వైరాగ్యము) ద్వారమో, అందువలన.
ఆంతటనూ ఆసక్తిలేకుండా శ్రేయస్సుకొరకై ఎల్లప్పుడును
అధికముగా సదాత్మయందు ధ్యానము చేయుము.
377 వ శ్లోక తాత్పర్యము:
అంటే అన్నీ వశములో వుంచుకొనేవాడికి వైరాగ్యముకన్నా
సుఖమును కలిగించేది చూడను; ఆ వైరాగ్యము అతి శుద్ధమైన
ఆత్మ బోధముతో కూడినదైనచో
స్వారాజ్యసామ్రాజ్యములను
ఇచ్చునది; శాశ్వతమైన ముక్తి అనెడి యువతి
పొందుటకై ఆ వైరాగ్యము ద్వారము. అందువలన ఆంతటనూ
ఆసక్తిలేకుండా శ్రేయస్సుకొరకై ఎల్లప్పుడును అధికముగా
సదాత్మయందు ధ్యానము చేయుము.
ఇక్కడ అందువలన ఆంతటనూ ఆసక్తిలేకుండా శ్రేయస్సుకొరకై
ఎల్లప్పుడును అధికముగా సదాత్మయందు ధ్యానము చేయుము అని
చెప్పాడు కాబట్టి ఆ ధ్యాన విధానము ముందు శ్లోకములో
చెపుతాడు గురువు.
శ్లోకము 378
ఆశాం ఛిన్ధి విషోపమేషు విషయేః ఏష్వైవ మృత్యోః సృతిః
జాతికులాశ్రమేష్వభిమతం
ముఞ్చాతిదూరాత్క్రియాః ।
దేహాదావసతి త్యజ ఆత్మధిషణాం ప్రజ్ఞాం కురుష్వాత్మని
త్వం ద్రష్టాస్యమలోఽసి నిర్ద్వయ పర బ్రహ్మాసి
యద్వస్తుతః ॥
1 ఆశాం ఛిన్ధి విషోపమేషువిషయేషు
ఏషేవ మృత్యోః సృతిః
విషోపమేషువిషయేషు ఆశాం ఛిన్ధి -
విషముతో సమానమైన విషయములందు ఆశను చేధించుము;
ఏషేవ మృత్యోః సృతిః - ఇదే మృత్యువుకు
కారణము;
విషముతో సమానమైన విషయములందు ఆశను చేధించుము.
ఇదే మృత్యువుకు కారణము;
2 జాతికులాశ్రమేష్వభిమతం
ముఞ్చాతిదూరాత్క్రియాః
జాతికులాశ్రమేషు అభిమతం
ముఞ్చా అతిదూరాత్ క్రియాః
జాతికులాశ్రమేష్వభిమతం (త్యక్త్వా) -
జాతి కుల ఆశ్రముల మీద అభిమానము విడిచి
క్రియాః ముఞ్చా అతిదూరాత్ -
దానికి సంబంధించిన క్రియలను అతి దూరముగా
వుంచుము;
జాతి కుల ఆశ్రముల మీద అభిమానము విడిచి
దానికి సంబంధించిన క్రియలను అతి దూరముగా వుంచుము;
3 దేహాదావసతి త్యజాత్మధిషణాం
ప్రజ్ఞాం కురుష్వాత్మని-
దేహాదౌ అసతి త్యజ ఆత్మధిషణాం
ప్రజ్ఞాం కురుష్వ ఆత్మని -
అసతి దేహాదౌ ఆత్మధిషణాం త్యజ -
అసత్యము లైన దేహాదులందు అహంకారమును
విడువుము
ప్రజ్ఞాం కురుష్వ ఆత్మని -
ఆత్మయందు బ్రహ్మజ్ఞానమును నిలుపుము;
అసత్యము లైన దేహాదులందు అత్మభావమును విడువుము;
ఆత్మయందు నీ మనస్సుని నిలుపుము
4 త్వం ద్రష్టాస్యమలోఽసి నిర్ద్వయ
పరబ్రహ్మాసి యద్వస్తుతః-
త్వం ద్రష్టా అసి అమలోఽసి
నిర్ద్వయపరబ్రహ్మాసి యత్ వస్తుతః
యత్ త్వం ద్రష్టా అసి అమలోఽసి -
ఏకారణము వలన నీవు ద్రష్టగా అయి వున్నావో, నిర్మలుడి గా
వున్నావో
వస్తుతః నిర్ద్వయపరబ్రహ్మాసి -
యదార్థముగా అద్వైత పరబ్రహ్మము అయి వున్నావు.
378 వ శ్లోక తాత్పర్యము:
విషతుల్యమైన విషయభోగములందు ఆసక్తిని తృంచివేయుము; ఇవే
మృత్యువునకు కారణములు;జాతి కుల ధర్మములందు అభిమానము
విడిచి పెట్టుము;కామ్యకర్మలను ఎంతో దూరము
నెట్టివేయుము; అసత్యములైన దేహాదులందు ఆత్మ భావమును
విడిచి పెట్టుము; పరమాత్మ యందే నీ మనస్సుని లగ్నము
చేయుము. నీవు ద్రష్టవు. నిర్మలుడవు. వస్తు తత్త్వముచే
నీవు సాక్షాత్ నిర్ద్వందమైన పరబ్రహ్మవు;
శ్లోకము 379
లక్ష్యే బ్రహ్మణిమానసం దృఢతరం సంస్థాప్య
బాహ్యేన్ద్రియమ్
స్వస్థానే వినివేశ్య నిశ్చలతనుః ఉపేక్ష్య దేహస్థితిమ్।
బ్రహ్మత్మ్తైక్యం ఉపేత్య తన్మయతయా చాఖణ్డవృత్త్యానిశం
బ్రహ్మానన్దరసం పిబాత్మని ముదా శూన్యైః కిమన్యైః
భ్రమైః ॥
1 లక్ష్యే బ్రహ్మణిమానసం దృఢతరం
సంస్థాప్య బాహ్యేన్ద్రియమ్
స్వస్థానే వినివేశ్య నిశ్చలతనుః
ఉపేక్ష్య దేహస్థితిమ్ ।
లక్ష్యే బ్రహ్మణి మానసం -
లక్ష్యమైన బ్రహ్మమునందు మనస్సుని
మానసం దృఢతరం సంస్థాప్య -
మనస్సుని ధృడముగా స్థాపించి
బాహ్యేన్ద్రియమ్ స్వస్థానే వినివేశ్య
- బాహ్యేన్ద్రియములను వాటి స్థానములలో
వుంచి
ఉపేక్ష్య దేహస్థితిమ్ నిశ్చలతనుః -
దేహస్థితిని విడిచి నిశ్చలమైన
శరీరము కలవాడవై;
అంటే - "లక్ష్యమైన బ్రహ్మమునందు మనస్సుని
ధృడముగా స్థాపించి, బాహ్యేన్ద్రియములను వాటి
స్థానములలో వుంచి, దేహస్థితిని విడిచి నిశ్చలమైన
శరీరము కలవాడవై "
2 బ్రహ్మత్మ్తైక్యం ఉపేత్య తన్మయతయా
చాఖణ్డవృత్త్యానిశం
బ్రహ్మానన్దరసం పిబాత్మని ముదా
శూన్యైః కిమన్యైః భ్రమైః-
బ్రహ్మత్మ్తైక్యం ఉపేత్య - బ్రహ్మైకత్యము పొంది
అఖణ్డవృత్యా అనిశం - ఎల్లప్పుడు అఖండవృత్తితో'
తన్మయతయా - తన్మయముతో
ముదా బ్రహ్మానన్దరసం పిబా -
సంతోషముతో బ్రహ్మానంద రసమును త్రాగుము
బ్రహ్మైకత్యము పొంది ఎల్లప్పుడు అఖండవృత్తితో',
తన్మయముతో సంతోషముతో బ్రహ్మానంద రసమును త్రాగుము;
శూన్యైః కిమన్యైః భ్రమైః- - శూన్యైః
అన్యైః భ్రమైః కిమ్ -
శూన్యములైన అన్య భ్రమలతో ఏమి ప్రయోజనము?
379 వ శ్లోక తాత్పర్యము:
లక్ష్యమైన బ్రహ్మమునందు మనస్సుని మనస్సుని ధృడముగా
స్థాపించి, బాహ్యేన్ద్రియములను వాటి స్థానములలో వుంచి
దేహస్థితిని విడిచి నిశ్చలమైన శరీరము కలవాడవై ;
బ్రహ్మైకత్యము పొంది ఎల్లప్పుడు అఖండవృత్తితో',
తన్మయముతో సంతోషముతో బ్రహ్మానంద రసమును త్రాగుము;
శూన్యములైన అన్య భ్రమలతో ఏమి ప్రయోజనము?"
ఇక్కడ దేహస్థితిని విడువుము అనడములో , గురువు ముందు
చెప్పిన మాట గుర్తుచేస్తున్నాడు; అది "ప్రారబ్ధం
పుష్యతి వపుః" అంటే దేహము ప్రారబ్ధ కర్మని పెంచుతుంది
అని. అందుకని దేహస్థితిని విడువుము అని.
ఇలాచెప్పిన దానిని సంగ్రహముగా ఇలా చెప్పవచ్చు;
ఆత్మజ్ఞానము పొందాలి అంటే , దుఃఖాలకి కారణమైన అనాత్మ
విషయాలు వదిలెయ్యాలి; అది ఆఖరి శ్లోకములో వస్తుంది
శ్లోకము 380
అనాత్మచిన్తనం త్యక్త్వా
కశ్మలం దుఃఖకారణమ్।
చిన్తయాత్మానమ్ అనన్దరూపం
యన్ముక్తి కారణమ్॥
కశ్మలం దుఃఖకారణమ్ -
అపవిత్రమైన దుఃఖ కారణమైన
అనాత్మచిన్తనం త్యక్త్వా -
అనాత్మ చింతనము వదిలి
అనన్దరూపం యన్ముక్తి కారణమ్ -
ఆనందరూపమైన ముక్తి కారణమైన
చిన్తయాత్మానమ్ -
అత్మను ధ్యానించుము
380 వ శ్లోక తాత్పర్యము:
అపవిత్రమైన దుఃఖ కారణమైన అనాత్మ చింతనము వదిలి,
ఆనందరూపమైన ముక్తి కారణమైన అత్మను ధ్యానించుము
॥ఓం తత్ సత్॥
_____________________________________________________
__________________________________