!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 387-390
వివేక చూడామణి 387-390 శ్లోకములు:
ఇక్కడ మూడు శ్లోకాలలో సృష్టికర్త అనబడే బ్రహ్మ నుంచి
అతి సూక్ష్మమైన జీవి వరకు గల అన్ని ఉపాధులు అసత్యమైనవే
అని, తనలోనే వున్న సంపూర్ణ ఆత్మ యే పరమాత్మ తత్త్వమని
గ్రహించమని మనకి గురువు చెపుతూ అహం బ్రహ్మాస్మి,
తత్త్వమసి అన్న మహావాక్యాలతో సమస్త దేవగణములు కూడా
బ్రహ్మ స్వరూపములే, అంటే ఆత్మతత్త్వముతో కూడినవే అని
చెపుతాడు.
శ్లోకము 387:
బ్రహ్మాద్యాః స్తమ్బపర్యన్తా
మృషమాత్రా ఉపాధయః।
తతః పూర్ణం స్వమాత్మానం
పశ్యేత్ ఏకాత్మనాస్థితమ్॥ 387॥
1 బ్రహ్మాద్యాః స్తమ్బపర్యన్తా -
సృష్టికర్త అనబడే బ్రహ్మ నుంచి అతి సూక్ష్మమైన జీవి
వరకు ( గల)
2 మృషమాత్రా ఉపాధయః।
అన్ని ఉపాధులు అసత్యమైనవే (అనిత్యమైనవే)
ఇక్కడ గురువు చెప్పిన మాట, సృష్టికర్త అనబడే బ్రహ్మ
నుంచి అతి సూక్ష్మమైన జీవి వరకు గల అన్ని ఉపాధులు
అసత్యమైనవే. ఇది ఒకసారి మనము ఇప్పటిదాకా విన్నమాటలతో
అన్వయము చేసుకుందాము
పంచకోశాలకి అతీతముగా వుండే నిర్గుణ నిరాకార నిరవికార
చైతన్యమే ఆత్మ అని, ఆ ఆత్మ యే పరమాత్మ అని, అదే సమస్త
జీవరాశులలో వుండే ఆత్మ అని ఇప్పటి దాకా గురువు చెప్పిన
మాటలలో విదితమే. అందులోనే సృష్టి కర్త అనబడే బ్రహ్మము
నుంచి అతి సూక్ష్మమైన జీవి వరకు గల ఏకత్వము మనకు
తెలుస్తుంది. మరి వాటిలో కనపడే భిన్నత్వము ( ఉపాధులు)
అసత్యమైనవే
3 తతః పూర్ణం స్వమాత్మానం -
అందువలన తన సంపూర్ణ ఆత్మను;
4 పశ్యేత్ ఏకాత్మనాస్థితమ -
ఏక రూపముతో వున్న ఆత్మ తత్త్వముగా తెలిసికొనుము;
బ్రహ్మ నుంచి అతి సూక్ష్మమైన జీవి వరకు గల అన్ని
ఉపాధులు అసత్యమైనవే అన్నప్పుడు, వాటిలోని ఏకత్వము, అదే
ఆత్మ అనే పదార్థము , తనలో వున్నది కూడా అదే అని , అదే
ఆత్మ తత్త్వముగా ( పరమాత్మగా) తెలిసికొనుము అని గురువు
చెప్పిన మాట.
387 శ్లోక తాత్పర్యము॥ సృష్టికర్త అనబడే బ్రహ్మ నుంచి
అతి సూక్ష్మమైన జీవి వరకు ( గల) ఉపాధులు అన్నీ
అసత్యమైనవే (అనిత్యమైనవే). అందువలన తన సంపూర్ణమైన
ఆత్మను ఏక రూపముతో వున్న ఆత్మ తత్త్వముగా
తెలిసికొనుము.
శ్లోకము 388:
యత్రభ్రాన్త్యా కల్పితం యద్వివేకే
తత్తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నమ్।
భ్రాన్తేర్నాశే భ్రాన్తిద్రష్టాహితత్త్వమ్
రజ్జుస్తస్మాద్ విశ్వమాత్మస్వరూపమ్॥
1 యత్రభ్రాన్త్యా కల్పితం యద్వివేకే -
యత్ యత్ర భ్రాన్త్యా కల్పితం తత్ వివేకే -
ఏది ఎక్కడ భ్రాన్తిలో కల్పితమైనదో (అది) విచక్షణా
జ్ఞానముతో
అంటే దూరము నుంచి చూడబడిన తాడు బ్రాన్తిలో పాములాగ
కల్పితమైనదో ( కనబడినదో) అది విచక్షణా జ్ఞానముతో
చూడబడిన తాడులాగానే కనపడును - అది ముందు వాక్యములో
2 తత్తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నమ్ -
తత్ తన్మాత్రం తస్మాత్ విభిన్నం న ఏవ --
అది ఆ అధిష్టాను రూపములో (వుండు) దానికంటే భిన్నమైనది
కాదు
అంటే విచక్షణా జ్ఞానముతో, తాడులో చూచిన పాము అనే
భ్రాన్తి పోయి, చివరికి తాడే మిగులుతుంది
3 భ్రాన్తేర్నాశే భ్రాన్తిద్రష్టాహి తత్త్వమ్ రజ్జుః-
భ్రాన్తేః నాశే భ్రాన్తి ద్రష్టాహితత్త్వమ్-
భ్రాన్తి నాశనముతో భ్రాన్తిలో చూడబడిన దాని ( పాము)
తత్త్వము రజ్జువే;
4 తస్మాత్ విశ్వమాత్మస్వరూపమ్-
తస్మాత్ విశ్వం ఆత్మ స్వరూపమ్-
అలాగే విశ్వము కూడా (
విభిన్నరూపములలో కనపడిననూ) ఆత్మ స్వరూపమే
387 శ్లోక తాత్పర్యము:
భ్రాన్తి వలన కలిగిన కల్పితము, విచక్షణా జ్ఞానము వలన
తన స్వరూపముతో కనపడును అందుకు భిన్నముగా కాదు.
భ్రాన్తి వలన కనపడిన పాము అను భావము భ్రాన్తి
పోగానే (విచక్షణా జ్ఞానముతో) మిగిలినది తాడు
మాత్రమే అని తెలిసికొనట్లు, ఈ విశ్వము కూడా
విభిన్నముగా కనపడుచున్ననూ అంతయూ పరమాత్మ స్వరూపమే.
శ్లోకము 389:
స్వయం బ్రహ్మా స్వయం విష్ణుః
స్వయం ఇన్ద్రః స్వయం శివః।
స్వయం విశ్వ మిదం సర్వం
స్వస్మాద్ అన్యత్ న కించన॥389||
1 స్వయం బ్రహ్మా స్వయం విష్ణుః-
తానే అంటే ఆత్మయే బ్రహ్మ, తానే విష్ణువు;
అహంబ్రహ్మాస్మి అన్నప్పుడు, తత్ త్వం అసి అన్నప్పుడు
మనకి తెలిసినది, జగత్తులో వున్నవన్నీ బ్రహ్మస్వరూపమే
అని , మనలో వున్నది బ్రహ్మమే అని, అంటే మన ఆత్మయే
బ్రహ్మ స్వరూపము అని తెలుసు కున్నాము. అప్పుడు మనకి
బాహ్య ప్రపంచములోని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మన
ఆత్మ స్వరూపములే . అదే మాట ఇక్కడ నాలుగు పాదలలో
చెప్పబడడమైనది.
2 స్వయం ఇన్ద్రః స్వయం శివః।
తానే ఇంద్రుడు తానే శివుడు;
3 స్వయం విశ్వ మిదం సర్వం-
తానే ఈ ప్రపంచమంతయూ;
4 స్వస్మాద్ అన్యత్ న కించన॥
తన కన్న భిన్నమైనది లేదు;
389 వ శ్లోక తాత్పర్యము
తానే అంటే ఆత్మయే బ్రహ్మ, విష్ణువు ఇంద్రుడు శివుడు;
ఆత్మయే ఈ ప్రపంచమంతయూ ఆత్మ కన్న భిన్నమైనది
లేదు;
అదే భావము లోపల బయట అంటూ 390 వ శ్లోకములో మళ్ళీ
చెప్పడమైనది.
శ్లోకము 390:
అన్తస్స్వయంచాపి బహిస్స్వయం చ
స్వయం పురస్తాత్ స్వయమేవ పశ్చాత్।
స్వయం హ్యవాచ్యాంస్వయమ్ప్యుదీచ్యామ్
తథోపరిష్టాత్ స్వయమయధస్తాత్ ॥390||
అన్తస్స్వయంచాపి బహిస్స్వయం చ-
అన్తః స్వయం చ అపి బహిః స్వయం చ-
లోపల వున్నది, బయట వున్నది కూడా తానే;
స్వయం పురస్తాత్ స్వయమేవ పశ్చాత్-
ఎదుటనున్నది వెనకాతల వున్నది కూడా తానే;
స్వయం హ్యవాచ్యాంస్వయమ్ప్యుదీచ్యామ్ -
స్వయం హి అవచ్యాం స్వయం ఉదీచ్యాం -
పశ్చిమము నందు వున్నది వుత్త్తరముందు వున్నది కూడా
తానే;
తథోపరిష్టాత్ స్వయమయధస్తాత్ -
తథా ఉపరిష్టాత్ స్వయమ్ అధస్తాత్-
క్రిందవున్నది పైన వున్నది కూడా తానే;
390 శ్లోక తాత్పర్యము :
లోపల వున్నది, బయట వున్నది కూడా తానే ;ఎదుటనున్నది
వెనకాతల వున్నది కూడా తానే; పశ్చిమము నందు వున్నది
వుత్త్తరముందు వున్నది కూడా తానే క్రిందవున్నది పైన
వున్నది కూడా తానే
||ఓం తత్ సత్ ॥
__________________________________