!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 397-400
ముందు శ్లోకములలో బ్రహ్మ స్వరూపము గురించి మళ్ళీ చెపుతూ తరంగములు నురుగు సుడిగుండము మొదలగు వన్నీ నీరే అయినట్లు, శరీరములో దేహము మొదలు లోనగల అహంభావము మొదల్గువన్నీ చిత్ స్వరూపమే అని, ఇంద్రియములకు మనస్సుకి కనిపించుచున్న జగత్తు అంతయూ బ్రహ్మమే, మాయా మదిరముతో వచ్చిన భ్రాంతిలో నువ్వు నేను వేరే అనే భ్రమలో పడతారు అని చెప్పాడు గురువు. అదే ధోరణిలో బ్రహ్మ స్వరూపము ఆకాశము వలె నిర్మలమైనది, నిర్వికల్పమైనదినిర్వికారమైనది అని చెప్పి, అ బ్రహ్మ స్వరూపము నీవే అని, అలాగే "నేనే బ్రహ్మము" అని తెలిసికొనిన బుద్ధి కలవారు బాహ్య విషయ ప్రపంచము వదిలివేసి, బ్రహ్మభూతులై అంటే అంతా బ్రహ్మమే అన్న స్వభావము కలవారై సదా చిదానందముతో నిండినవారగుదురు అని చెప్పాడు.
ఇక్కడ బ్రహ్మయొక్క చిదానంద స్వరూపము పూర్తిగాదానుభవించడానికి ఆనాత్మ విషయాలని పూర్తిగా నాశనము చేయ్యాలి 397-98 శ్లోకాలలో చెపుతాడు. 399వ శ్లోకములో బ్రహ్మము యందు చిత్తవృత్తి నిలుపబడినతరువాత , అనాత్మ సంబంధమైన వికల్పములు కనపడవు - ఆవికల్పములు పేరుకు మాత్రమే ఉంటాయి అని చెపుతాడు గురువు. అద్వితీయమైన బ్రహ్మములో విభిన్నము అన్నమాట ఉండనే ఉండదు అన్నమాటతో 400వ శ్లోకము పూర్తి చేస్తాడు గురువు.
శ్లోకము 397
శవాకారం యావత్ భజతి మనుజః తావదశుచిః
పరేభ్యః స్యాత్ క్లేశో జననమరణ వ్యాధినిరయాః।
యదాత్మానం శుద్ధం కలయతి శివాకారమచలమ్
తదా తేభ్యో ముక్తో భవతి తదాహ శ్రుతిరపి॥397॥
1 శవాకారం యావత్ భజతి మనుజః తావదశుచిః:
శవాకారం యావత్ భజతి-
శవాకారరూపమైన ఈ స్థూలదేహామును ఎప్పటిదాకా పూజిస్తాడో;
మనుజః తావదశుచిః:-
మనుజుడు అప్పటి వరకు అశుచియే;
శవాకారరూపమైన ఈ స్థూలదేహామును ఎప్పటిదాకా మనుజుడు పూజిస్తాడో, అప్పటి వరకు అశుచియే;
2 పరేభ్యః స్యాత్ క్లేశో జననమరణ వ్యాధినిరయాః।
పరేభ్యః స్యాత్ క్లేశో -
ఇతరులవలన క్లేశము;
జననమరణ వ్యాధినిరయాః-
జననము మరణము వ్యాధులు కలుగుచుండును;
శవాకారరూపమైన ఈ స్థూలదేహామును ఎప్పటిదాకా మనుజుడు పూజిస్తాడో, అప్పటి వరకు అశుచియే; ఇతరులవలన క్లేశము జననము మరణము వ్యాధులు కలుగుచుండును;
3 యదాత్మానం శుద్ధం కలయతి శివాకారమచలమ్
యదాత్మానం శుద్ధం -
ఎప్పుడు తనను శుద్ధమైనవానిగా
శివాకారమచలమ్ కలయతి -
శివ స్వరూపునిగా చాంచల్య రహితునిగా గ్రహించునో
4 తదా తేభ్యో ముక్తో భవతి తదాహ శ్రుతిరపి
తదా తేభ్యో ముక్తో భవతి -
అప్పుడు ఆ అశుచి భావములనుంచి ముక్తుడగును;
తదాహ శ్రుతిరపి -
అదే శ్రుతులు కూడా చెప్పుచున్నవి;
ఎప్పుడు తనను శుద్ధమైనవానిగా శివ స్వరూపునిగా చాంచల్య రహితునిగా గ్రహించునో అప్పుడు ఆ అశుచి భావములనుంచి ముక్తుడగును;అదే శ్రుతులు కూడా చెప్పుచున్నవి
397 వ శ్లోక తాత్పర్యము:
ఈ శవరూపములో వున్న ఈ దేహమును కొలుచుచున్నంతవరకు ( దాని సేవలోనే) నిమగ్నమైనంతవరకు, మనిషి అశుచి అగుచున్నాడు. (అట్టివానికి) ఇతరులవలన దుఃఖములు కలుగును. జననము మరణము వ్యాధి మొదలగు వాని వలన బాధపడుచుండును. ఎప్పుడూ తనని పరిశుద్దినిగా నిశ్చలుడైన శివుని రూపముగా తెలిసికొనునో అప్పుడె ఆ బంధముల నుండి సదా ముక్తుడై (పరమాత్మ స్వరూపునిగా ) ఉండును.
శ్లోకము 398
స్వాత్మన్యారోపితాశేష
అభాసవస్తునిరాసతః।
స్వయమేవ పరం బ్రహ్మ
పూర్ణమద్వయమక్రియం ॥398॥
1 స్వాత్మన్యారోపితాశేషా -
స్వ ఆత్మనా ఆరోపిత అశేష -
తన ఆత్మయందు ఆరోపింపబడిన అశేషమైన;
2 ఆభాసవస్తు నిరాసతః -
ఆత్మకన్న భిన్నమైన వానిని తొలగించబడడముతో;
తన ఆత్మయందు ఆరోపింపబడిన అశేషమైన ఆత్మకన్న భిన్నమైన వానిని తొలగించబడడముతో మిగిలినది ? - అదే పంచకోశములు తోలగించబడిన తరువాత మిగిలిన క్రియారహితమైన అద్వితీయమైన చైతన్య స్వరూపము. అదే గురువు ముందు పాదములో చెపుతాడు.
3 స్వయమేవ పరం బ్రహ్మ -
తానే పరబ్రహ్మమగును;
( ఎలాంటి ప్రబ్రహ్మము)
4 పూర్ణమద్వయమక్రియం-
పూర్ణం అద్వయం అక్రిం-
పూర్ణమైనది, అద్వితీయమైనది, క్రియాశూన్యమైనది ( అగు పరబ్రహ్మము)
ఆత్మకన్న భిన్నమైనవానిని తొలగించడముతో - జీవాత్మ తానే పూర్ణమైనది, అద్వితీయమైనది, క్రియాశూన్యమైనది పర బ్రహ్మము అగును.
398 వ శ్లోక తాత్పర్యము:
ఆత్మయందు ఆరోపింపబడిన ప్రతిబింబ మాత్రమైన ( అభాస అసత్యమ్లైన) అనేకములగు భావములను ( వస్తువులను)తొలగించునప్పుడు పర బ్రహ్మ స్వరూపము స్వయముగా పూర్తి రూపముతో అద్వితీయునిగా క్రియారహితునిగా ప్రకాశించును.
శ్లోకము 399
సమాహితాయాం సతి చిత్తవృత్తౌ
పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే।
న దృశ్యతే కశ్చిదయం వికల్పః
వ్రజల్ప మాత్రః పరిశిష్యతే తతః॥399॥
1 సమాహితాయాం సతి చిత్తవృత్తౌ -
చిత్త వృత్తి నిశ్చలముగా నిలుపబడినది అగుచుండగా;
చిత్తవృత్తి బ్రహ్మములో ఎక్కడ నిలపాలి ? బ్రహ్మము లో నిలపాలి అది ముందు వాక్యములో
2 పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే -
నిర్వికల్పమగు బ్రహ్మయందు :
నిర్వికల్పమగు బ్రహ్మయందు చిత్త వృత్తి నిశ్చలముగా నిలుపబడినది అగుచుండగా , అంటే అనాత్మ స్వరూపాలని నాశనము చేస్తే మిగిలేది నిర్వికల్ప బ్రహ్మ స్వరూపమే.
3 న దృశ్యతే కశ్చిదయం వికల్పః-
అనాత్మసంబంధమైన వికల్పములు కనపడవు
4 వ్రజల్ప మాత్రః పరిశిష్యతే తతః -
ఆ తరువాత ( అనాత్మ సంబంధమైన వికప్లములు) పేరుకు మాత్రమే మిగులును
బ్రహ్మము యందు చిత్తవృత్తి నిలుపబడినతరువాత , అనాత్మ సంబంధమైన వికల్పములు కనపడవు - ఆవికల్పములు పేరుకు మాత్రమే మిగులును.
తాత్పర్యము:
చిత్తవృత్తులన్నియును ( అంటే మనోబుద్ధులలో కలుగు ఆందోళనలు అలజడులు , ఆలోచనలు వాంఛలు, వగైరా) నిర్వికల్పమైన పరబ్రహ్మమునందు ( పరమాత్మగురించి భావనయందు ఏక వృత్తియందు) లయపరచినప్పుడు, ఈ కల్పింపబడిన విభిన్నత్త్వము అంతయూ ఏమాత్రము గోచరించదు. ( ఆ నిజము అనుభవ పూర్వకముగా తెలిసికొనినపిమ్మట), ఈ శాస్త్ర చర్చ, వాగ్వివాదములు, నిరుపయోగమైన ధ్వనులు మాత్రమే.
శ్లోకము 400
అసత్కల్పో వికల్పోఽయం విశ్వమిత్యేకవస్తుని।
నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదా కుతః॥ 400॥
1 అసత్కల్పో వికల్పో అయం విశ్వమితి ఏకవస్తుని
ఏకవస్తుని -
ఒకే వస్తువులో అంటే అద్వితీయమైన బ్రహ్మములో;
అయం విశ్వమితి వికల్పః అసత్కల్పో -
విభిన్నకల్పన అయిన విశ్వము అసత్యము;
అద్వితీయమైన బ్రహ్మములోవిభిన్నకల్పన అయిన విశ్వము అసత్యము
2 నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదా కుతః -
నిర్వికారే నిరాకారే నిర్విశేషే - నిర్వికారమైన నిరాకారమైన నిశ్శేషమైన ( బ్రహ్మములో)
భిదా కుతః - బిన్నము ఎక్కడ?
నిర్వికారమైన నిరాకారమైన నిశ్శేషమైన బ్రహ్మములో బిన్నత్వము ఎక్కడ?
400 వ శ్లోక తాత్పర్యము:
ఏకవస్తువు (అద్వయుడైన) అయిన పరమాత్మయందు ఈ విబిన్నకల్పన అయిన విశ్వమంతయూ అసత్యము. నిర్వికారుడు నిరాకారుడు నిర్విశేషుడు ( మరొక వస్తువుగాని గుణము కాని లేనివాడు) అయిన వాని ( పరమాత్మ)యందు విభిన్నత్వము ఏట్లు వుండును?
________________________________________________________
__________________________________