!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 407-410
మనకి భేదము కనపడడానికి మనస్సే కారణము.మనస్సు నిశ్చలముగా చేసినప్పుడు దానిలో ఏమీ ఆరోపింపలేము. మనస్సు నిలిపి సామాధిలో బ్రహ్మము ప్రతిష్ఠించితే వచ్చేదే బ్రహ్మానుభూతి. "హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ" అంటూ అట్టి బ్రహ్మమును విద్వాంసుడు హృదయములో చూస్తాడు అంటూ , బ్రహ్మమును ప్రతిష్ఠించడానికి బ్రహ్మమును అకర్షవంతముగా మూడు శ్లోకాలలో ( 409-411)వర్ణిస్తాడు గురువు
శ్లోకము 407
అనన్యత్వమధిష్థానాత్ ఆరోప్యస్య నిరీక్షణమ్ ।
పణ్డితైః రజ్జుసర్పాదౌ వికల్పో భ్రాన్తి జీవనః॥
1 అనన్యత్వమధిష్థానాత్ -
అధిష్టానము కంటే వేరుగా లేకుండుట;
2 ఆరోప్యస్య -
అరోపింవబడినది
అంటే తాడులో పాము చూచినా , ఆ ఆరోపింపబడిన పాము ( నిజానికి) తాడు కన్న వేరుకాదు. అది నిజము. అది పండితులచే చూడబడినది.
3 పణ్డితైః రజ్జుసర్పాదౌ నిరీక్షణమ్ -
పండితులచేత రజ్జు సర్పములో చూడబడినది
4 వికల్పో భ్రాన్తి జీవనః-
భేదబుద్ధి బ్రాంతిలో జనించినది
మనకు కలిగిన భేదబుద్ధి భ్రాంతివలన కలిగినది మాత్రమే
407 వ శ్లోక తాత్పర్యము:
(ఒక వస్తువునందు భ్రమవలన మరొక వస్తువు ఆరోపింపబడినప్పుడు- ఒక వస్తువును చూచి మరొక వస్తువు అని భ్రమించినప్పుడు) ఆ అరోపింపబడిన దానికి, ఆధారమైనదానికి వస్తు తత్త్వములో భేదము లేదు అని పండితులు తెలిసికొనగలరు. త్రాడులోనూ దానిపై అరోపింపబడిన - భ్రమలో చూచుచున్న సర్పము నందును ఉన్నది ఒకటే వస్తుతత్త్వము. అదే రజ్జు తత్త్వము.
ఈ మాట చెప్పడములో భావము బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా అన్నమాట వివరించడము కోసమే. ఎలాగైతే - త్రాడులోనూ దానిపై అరోపింపబడిన - భ్రమలో చూచుచున్న సర్పము నందును ఉన్నది ఒకటే వస్తుతత్త్వము అన్నామో - బ్రహ్మము - బ్రహ్మము ఆధారముగా బ్రహ్మముపై అరోపింపబడిన విశ్వము అంతయూ భ్రాంతి జనితమైనది. కావున దాని వస్తుతత్త్వము , విశ్వమునకు అధారభూతమైన బ్రహ్మ వస్తు తత్త్వమునకు భేదము లేదు.ఆ వస్తు తత్త్వము బ్రహ్మమే.
ఇక్కడ ముందు శ్లోకాలలో మన వికల్పాలకి కారణము మన మనస్సే ( చిత్తము). అందువలన ఆ పరిగెత్తే చిత్తమును నిలపాలి అని మళ్ళీ గురువు చెప్పి , నిలిపిన్ అమనస్సులో బ్రహ్మము ప్రతిష్ఠించాలి. అదే బ్రహ్మానుభూతికి నాంది.
శ్లోకము 408
చిత్తమూలో వికల్పోఽయమ్ చిత్తాభావే న కశ్చన।
అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్ రూపే పరాత్మని॥
1 చిత్తమూలో వికల్పః అయమ్ -
ఈ వికల్పము చిత్తమే మూలముగా కలది:
ఈ భేదబుద్ది (వికల్పము) పరుగుతున్న మనస్సే కారణముగా కలది. అంటే బహిర్ముఖమైన మనస్సే ఈ భ్రాన్తి కలిగిస్తుంది
2 చిత్తాభావే న కశ్చన -
మనస్సు లేనప్పుడు( నిద్రపోయినప్పుడు) ఈ వికల్పము లేదు;
3 అతః చిత్తం సమాధేహి -
అందువలన చిత్తమును నిలుపుము;
4 ప్రత్యగ్ రూపే పరాత్మని -
నా స్వరూపమైన పరాత్మయందు;
అంటే, మనస్సు లేనప్పుడు( నిద్రపోయినప్పుడు) ఈ వికల్పము లేదు కాబట్టి - అందువలన మనస్సును పరమాత్మ తత్త్వములో నిలుపుము అని;
408 వ శ్లోక తాత్పర్యము:
భిన్నత్వమునకు చిత్తమే ( మనస్సే) మూలము. మనస్సు లేనప్పుడు భిన్నత్త్వము ఉండదు ( గాఢనిద్రలో లేనట్లుగా)కావున నీ మనస్సు పరమాత్మ తత్త్వములో విలీనపరుచుము.
మరి మనస్సును పరమాత్మ తత్త్వములో విలీనపరచడానికి, ఆ పరమాత్మ తత్త్వాని అందమైన మాటలలో గురువు బోధిస్తాడు.
శ్లోకము 409;
కిమపి సతతబోధం కేవలానన్దరూపమ్
నిరుపమ మతివేలమ్ నిత్యముక్తం నిరీహమ్।
నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం
హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ॥
1 కిమపి సతతబోధం కేవలానన్దరూపమ్ -
వర్ణింపనలవికాని , ఎల్లప్పుడును జ్ఞానస్వరూపమైన, కేవలము ఆనంద స్వరూపముమను;
నిరుపమ మతివేలమ్ నిత్యముక్తం నిరీహమ్-
సాటిలేని, ఎల్లలు లేనివాని, నిత్యముక్త స్వరూపమును, ఇచ్ఛాశూన్యమైన;
నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం -
అవధులులేని ఆకాశమంతటి,అవయవములు లేని, వికల్ప శూన్యమైన;
హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ-
పూర్ణం బ్రహ్మ విద్వాన్ సమాధౌ హృది కలయతి-
పూర్ణమైన బ్రహ్మమును విద్వాంసుడు సమాధిలో హృదయములో చూచును;
409 వ శ్లోక తాత్పర్యము:
చెప్పనలవికాని సంతత జ్ఞాన స్వరూపుడు కేవలుడు ఆనందరూపుడు దేనితోనూ పోల్చతగనివాడు, ఎల్లలు లేనివాడు ( అతివేలమ్) నిత్యముక్తుడు, క్రియారహితుడు, అంతులేని ఆకాశము వలె భాగములు లేనివాడు, నిర్వికల్పుడు అయిన పరబ్రహ్మము ను పండితుడు సమాధిలో తన హృదయ కుహరములో చూచుచున్నాడు.
శ్లోకము 410
ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం
సమరసమసమానం మాన సంబంధ దూరమ్।
నిగమ వచన సిద్ధం నిత్యమస్మద్ ప్రశిద్ధమ్
హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ॥
ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం -
ప్రకృతి వికృతి శూన్యమైన , ఊహకి అందని స్వభావము కలవాడు;
సమరసం అసమానం మాన సంబంధ దూరమ్-
సమమైన రసము కల, సాటిలేని, ప్రమాణములయొక్క సంబంధమునకు దూరమైనదియు;
నిగమ వచన సిద్ధం నిత్యం అస్మద్ ప్రశిద్ధమ్-
శ్రుతి వచనములతో సిద్దించు, నిత్యమైనదియు, నేను అన్నమాటతో ప్రశిద్ధమైన
హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ॥
పూర్ణమైన బ్రహ్మమును విద్వాంసుడు సమాధిలో హృదయములో చూచును;
410 వ శ్లోకతాత్పర్యము:
కనపడుచున్న ప్రకృతిగాని దాని మార్పులు కాని లేనివాడు (ప్రకృతి వికృతి శూన్యం); ఎల్లా ఆలోచనలకు అతీతమైన వాడు; స్థిమితమైన మహా జలరాశివలె వుండూవాడు; గుణములవలన కలిగిన వికారములను శమింప చేసినవాడు;పేరుచే నిర్దేశింపలేనివాడును;శాంత స్వరూపుడును, కేవలుడునూ అయిన పరబ్రహ్మమును పండితుడు సమాధిలో తన హృదయ కుహరములో చూచుచున్నాడు.
||om tat sat||
_______________________________________________________
__________________________________