!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 411-413
మనకి భేదము కనపడడానికి మనస్సే కారణము.మనస్సు నిశ్చలముగా చేసినప్పుడు దానిలో ఏమీ ఆరోపింపలేము. మనస్సు నిలిపి సామాధిలో బ్రహ్మము ప్రతిష్ఠించితే వచ్చేదే బ్రహ్మానుభూతి. "హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ" అంటూ అట్టి బ్రహ్మమును విద్వాంసుడు హృదయములో చూస్తాడు అంటూ , బ్రహ్మమును ప్రతిష్ఠించడానికి బ్రహ్మమును అకర్షవంతముగా మూడు శ్లోకాలలో ( 409-411)వర్ణిస్తాడు గురువు. బ్రహ్మమును హృదయాంతరాళములలో చూడగలిగినవానికి జన్మ సఫలీకృతమై సంసార చక్రమునుంచి బయట పడతాదు అని (412-413) శ్లోకములలో వింటాము.
శ్లోకము 411
అజరమమరం అస్తాభాసవస్తు స్వరూపం
స్థిమితసలిలరాశిప్రఖ్యం ఆఖ్యావిహీనమ్।
శమిత గుణ వికారం శాశ్వతమ్ శాన్తమేకం
హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ॥
1 అజరమమరం అస్తాభాసవస్తు స్వరూపం
అజరమమరం - ముసలితనము మరణము లేని వాడు;
అస్తాభాసవస్తు స్వరూపం - వికల్పశూన్యవస్తు స్వరూపము కలవాడు;
2 స్థిమితసలిలరాశిప్రఖ్యం ఆఖ్యావిహీనమ్
స్థిమితసలిలరాశిప్రఖ్యం - నిశ్చలమైన జలరాశి వలె నున్నవాడును;
ఆఖ్యావిహీనమ్ - నామ శూన్యము కలవాడును;
3 శమిత గుణ వికారం శాశ్వతమ్ శాన్తమేకం
శమిత గుణ వికారం - గుణములవలన కలిగిన వికారములను శాంతింపచేసినవాడు;
శాశ్వతమ్ శాన్తమేకం - నిత్యమైనది శాంతమైనది ఒక్కటియే అయినది
4 హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ-
అట్టి పూర్ణ బ్రహమును పండితుడు సమాధి స్థితిలో తన హృదయకుహరములలో చూచుచున్నాడు
411 వ శ్లోక తాత్పర్యము:
ముసలితనము మరణము లేని వాడు, వికల్పశూన్యవస్తు స్వరూపము కలవాడు (అభావముతొలగి నిజస్వరూపముతో ప్రకాశించువాడు), నిశ్చలమైన మహా జలరాశివలెనున్నవాడు, నామ శూన్యము కలవాడును (పేరుచే నిర్దేశింపలేనివాడు) గుణములవలన కలిగిన వికారములను శాంతింపచేసినవాడు, నిత్యమైన శాంత స్వరూపుడు, ఒక్కటియే అయినవాడు , అయిన పూర్ణ పరబ్రహ్మమును పండితుడు సమాధి స్థితిలో తన హృదయకుహరములలో చూచుచున్నాడు.
శ్లోకము 412
సమాహితా అన్తః కరణః స్వరూపే
విలోకయాత్మనం అఖణ్డవైభవమ్।
విచ్ఛిన్థి బన్ధం భవగన్ధగన్దిలమ్
యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ॥
1 సమాహితా అన్తః కరణః స్వరూపే -
పరమాత్మయందు స్థిరముగా మనస్సు కలవాడవై;
2 విలోకయాత్మనం అఖణ్డవైభవమ్ -
( నీలో నున్న) అఖండ వైభవము కల ఆత్మను విలోకించుము
3 విచ్ఛిన్థి బన్ధం భవగన్ధగన్దిలమ్ -
సంసారగంధముతో వాసనలు కల బంధములను తొలగించుకొనుము;
అంటే పూర్వజన్మల వాసనలచేత కలుషితమైన నీ బంధములను త్రెంచుకొనుము.
4 యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ -
ప్రయత్నముతో పురుషత్వమును సఫలము చేసికొనుము;
అంటే మనుష్య జన్మ సఫలీకృతము చేయుము అని
412 వ శ్లోక తాత్పర్యము:
అంతః కరణమును సమాధి స్థితి యందు నిలిపి, అఖండవైభవముతో నీలోనున్న ఆత్మ తత్త్వమును అవలోకించుము. పూర్వజన్మల వాసనలచేత కలుషితమైన నీ బంధములను త్రెంచుకొనుము, ప్రయత్నముతో మనుజ జన్మ సఫలీకృతము చేయుము
శ్లోకము 413
సర్వోపాధి వినిర్ముక్తం
సచ్చిదానన్దం అద్వయం।
భావయాత్మానమాత్మస్థం
న భూయః కల్పసేఽధ్వనే॥
1 సర్వోపాధి వినిర్ముక్తం -
సమస్తమగు ఉపాధులతో విముక్తుడైన
2 సచ్చిదానన్దం అద్వయం -
సచ్చిదానంద స్వరూపునిగాను, ద్వితీయరహితమైన
3 భావయ ఆత్మానం ఆత్మస్థం-
ఆత్మస్థం ఆత్మానం భావయ -
ఆత్మలో నున్న ఆత్మను గురించి భావింపుము
4 న భూయః కల్పసే అధ్వనే-
మళ్ళీ సంసారమార్గములో(అధ్వనే) పడవు
అంటే తిరిగి ఈ జనన మరణ చక్రమందు చిక్కుకొనవు
413 వ శ్లోక తాత్పర్యము:
సమస్తమగు ఉపాధులతో విముక్తుడైన సచ్చిదానందుని, అద్వయుని, ఆ పరమాత్మను నీలో నున్నవానిని, భావించుచుండుము; తిరిగి ఈ జనన మరణ చక్రమందు చిక్కుకొనవు.
॥ఓమ్ తత్ సత్॥
__________________________________