!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 414-416
వివేక చూడామణి 411-413 శ్లోకములు:
మనకి భేదము కనపడడానికి మనస్సే కారణము.మనస్సు నిశ్చలముగా చేసినప్పుడు దానిలో ఏమీ ఆరోపింపలేము. మనస్సు నిలిపి సమాధిలో బ్రహ్మము ప్రతిష్ఠించితే వచ్చేదే బ్రహ్మానుభూతి. "హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ" అంటూ అట్టి బ్రహ్మమును విద్వాంసుడు హృదయములో చూస్తాడు అంటూ , బ్రహ్మమును మనస్సులో ప్రతిష్ఠించడానికి బ్రహ్మమును అకర్షవంతముగా మూడు శ్లోకాలలో ( 409-411)వర్ణిస్తాడు గురువు. బ్రహ్మమును హృదయాంతరాళములలో చూడగలిగినవానికి జన్మ సఫలీకృతమై సంసార చక్రమునుంచి బయట పడతాడు అని (412-413) శ్లోకములలో వింటాము.
శ్లోకము 411
అజరమమరం అస్తాభాసవస్తు స్వరూపం
స్థిమితసలిలరాశిప్రఖ్యం ఆఖ్యావిహీనమ్।
శమిత గుణ వికారం శాశ్వతమ్ శాన్తమేకం
హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ॥ జరా
1 అజరమమరం అస్తాభాసవస్తు స్వరూపం
అజరమమరం - జరా మరణము లేని;
అస్తాభాసవస్తు స్వరూపం - వికల్పశూన్యవస్తు స్వరూపము కల;
2 స్థిమితసలిలరాశిప్రఖ్యం ఆఖ్యావిహీనమ్
స్థిమితసలిలరాశిప్రఖ్యం - నిశ్చలమైన జలరాశి వలె నున్న;
ఆఖ్యావిహీనమ్ - నామ శూన్యము కల;
3 శమిత గుణ వికారం శాశ్వతమ్ శాన్తమేకం
శమిత గుణ వికారం - గుణములవలన కలిగిన వికారములను శాంతింపచేసిన;
శాశ్వతమ్ శాన్తమేకం - నిత్యమైనది శాంతమైనది ఒక్కటియే అయిన ( అద్వయమైన)
4 హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ-
అట్టి పూర్ణ బ్రహ్మమును పండితుడు సమాధి స్థితిలో తన హృదయ కుహరములలో చూచుచున్నాడు
411 వ శ్లోక తాత్పర్యము:
జరా మరణము లేని, వికల్పశూన్యవస్తు స్వరూపము కల (అభావముతొలగి నిజస్వరూపముతో ప్రకాశించు), నిశ్చలమైన మహా జలరాశివలెనున్న, నామ శూన్యము కల (పేరుచే నిర్దేశింపలేని) గుణములవలన కలిగిన వికారములను శాంతింపచేసిన, నిత్యమైన, శాంతమైన, అద్వయమైన పూర్ణ పరబ్రహ్మమును పండితుడు సమాధి స్థితిలో తన హృదయ కుహరములలో చూచుచున్నాడు.
శ్లోకము 412
సమాహితా అన్తః కరణః స్వరూపే
విలోకయాత్మనం అఖణ్డవైభవమ్।
విచ్ఛిన్థి బన్ధం భవగన్ధగన్దిలమ్
యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ॥
1 సమాహితా అన్తః కరణః స్వరూపే -
పరమాత్మయందు స్థిరముగా మనస్సు కలవాడవై;
2 విలోకయాత్మనం అఖణ్డవైభవమ్ -
( నీలో నున్న) అఖండ వైభవము కల ఆత్మను విలోకించుము
3 విచ్ఛిన్థి బన్ధం భవగన్ధగన్దిలమ్ -
సంసారగంధముతో వాసనలు కల బంధములను తొలగించుకొనుము;
అంటే పూర్వజన్మల వాసనలచేత కలుషితమైన నీ బంధములను త్రెంచుకొనుము.
4 యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ -
ప్రయత్నముతో పురుషత్వమును సఫలము చేసికొనుము;
అంటే మనుష్య జన్మ సఫలీకృతము చేయుము అని
412 వ శ్లోక తాత్పర్యము:
స్థిరముగా నిలుపబడిన మనస్సు కలవాడివై, అఖండవైభవముకల ఆత్మను చూడుము. సంసారసాగర వాసనలతో నిండిన బంధములను తొలగించుకొనుము. ప్రయత్నముతో నీ పురుషత్వమును సఫలము వేయుము
శ్లోకము 413
సర్వోపాధి వినిర్ముక్తం
సచ్చిదానన్దం అద్వయం।
భావయాత్మానమాత్మస్థం
న భూయః కల్పసేఽధ్వనే॥
1 సర్వోపాధి వినిర్ముక్తం -
సమస్తమగు ఉపాధులతో విముక్తుడైన
2 సచ్చిదానన్దం అద్వయం -
సచ్చిదానంద స్వరూపునిగాను, ద్వితీయరహితమైన
3 భావయ ఆత్మానం ఆత్మస్థం-
ఆత్మస్థం ఆత్మానం భావయ -
ఆత్మలో నున్న ఆత్మను గురించి భావింపుము
4 న భూయః కల్పసే అధ్వనే-
మళ్ళీ సంసారమార్గములో(అధ్వనే) పడవు
అంటే తిరిగి ఈ జనన మరణ చక్రమందు చిక్కుకొనవు
413 వ శ్లోక తాత్పర్యము:
సమస్తమగు ఉపాధులతో విముక్తుడైన సచ్చిదానందుని, అద్వయుని, ఆ పరమాత్మను నీలో నున్నవానిని, భావించుచుండుము; తిరిగి ఈ జనన మరణ చక్రమందు చిక్కుకొనవు.
॥ఓమ్ తత్ సత్॥
__________________________________